పంచాయతీల సొంత ఆదాయం వాటి ఖాతాల్లోనే

– చట్ట సవరణ అమలుకు ఉత్తర్వులు జారీ
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: గ్రామ పంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయం ఇకపై ట్రెజరీలో కాకుండా నేరుగా వాటి సొంత ఖాతాల్లోనే జమ అయ్యేలా చేసిన చట్ట సవరణ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) చట్టం 2026ను గత నెల 9 నుంచి అమల్లోకి తీసుకొస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నం.43ను శుక్రవారం జారీ చేసింది. గతంలో గ్రామ పంచాయతీలు సమకూర్చుకున్న సొంత ఆదాయం ట్రెజరీ ద్వారా ఖర్చు చేయాల్సి రావడంతో గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులోకి రావడంలో జాప్యం జరిగేది. అత్యవసర పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రహదారులు, ఇతర స్థానిక అవసరాల కోసం గ్రామ పంచాయతీలు నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. గ్రామాల అవసరాలకు అనుగుణంగా సొంత ఆదాయాన్ని వేగంగా వినియోగించుకునేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. మంత్రి సీతక్క చొరవతో గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన పెంచే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం అమలుకు ఇప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామ పంచాయతీల సొంత ఆదాయం నేరుగా వాటి ఖాతాల్లోనే జమ కావడంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వేగంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. గ్రామాల అభివృద్ధికి గ్రామ పంచాయతీలే మరింత బాధ్యతతో నిర్ణయాలు తీసుకునేలా, స్థానిక సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను పెంచే దిశగా ఈ చట్ట సవరణ కీలక అడుగుగా ప్రభుత్వం పేర్కొంది. చట్ట సవరణ ఉత్తర్వులు వెలువడటం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం చేశారు. ఇది పల్లెల ఆర్థిక స్వావలంబనకు కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *