ఎల్‌నినోతో బలహీనపడిన రుతుపవనాలు

– పంటల ఎంపికలో రైతులు జాగ్రత్తగా ఉండాలి
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 3 : ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పంటల ఎంపికలో జాగ్రత్త వహించాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. హుజుర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలలో ఆయన శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలా మారిందన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి నమోదైందని, భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఏడు రకాల సన్న వరి ధాన్యాలకు బోనస్ కూడా కొనసాగుతోందని, ఈ చర్యల వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిందని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని, జూన్‌లో దేశవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే సుమారు 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఇది ఇటీవలి సంవత్సరాల్లో అత్యంత పొడి జూన్ నెలల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో కూడా జూన్‌లో సుమారు 22 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో పలు ప్రాంతాల్లో విత్తనాలు విత్తడం ఆలస్యమైందన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువ భాగం మహారాష్ట్రలో ఉండటంతో అక్కడ కూడా వర్షాలు తక్కువగా కురవడం వల్ల తెలంగాణకు గోదావరి జలాల ప్రవాహం ఆలస్యమవుతోందని మంత్రి వివరించారు. నీటి లభ్యత అనిశ్చితంగా ఉన్న ప్రాంతాల్లో అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులు తక్కువ నీటితో సాగు చేయగలిగే, ఎండలను తట్టుకునే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. రిజర్వాయర్లలో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ముందుగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి అనంతరం సాగునీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. వర్షపాతం తక్కువగా కొనసాగితే సమర్థవంతమైన నీటి నిర్వహణ ఎంతో కీలకమని చెప్పారు. వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, పరిస్థితులకనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పొడి వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని రైతులకు భరోసా ఇచ్చారు. సరైన ప్రణాళిక, రైతుల సహకారంతో ఎల్‌నినో సవాళ్లను అధిగమించి వ్యవసాయం అభివృద్ధి పథంలో కొనసాగుతుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గడ్డిపల్లి గ్రామంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత పాఠశాల(ఇంటిగ్రేటెడ్ స్కూల్) నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. హుజూర్‌నగర్ పట్టణంలో రూ.7.25 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పనులను ఆయన పరిశీలించారు. అలాగే చిలుకూరు-జెర్రిపోతులగూడ బీటీ రహదారిని మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రారంభించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *