ఎమర్జెన్సీ ఒక కీలకమైన మలుపు

– గతాన్ని తెలుసుకుంటే భవిష్యత్తును బలంగా నిర్మించగలం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 3 : గతాన్ని తెలుసుకున్నప్పుడే భవిష్యత్తును బలంగా నిర్మించగలమని, మన దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక కీలకమైన మలుపు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం.. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది.. దాని వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టం ఏమిటి.. రాజ్యాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు.. వ్యక్తిగత, రాజకీయ స్వార్థాల కోసం అధికారాన్ని ఎలా వినియోగించారు.. ఇవన్నీ ప్రస్తుత తరానికి తప్పనిసరిగా తెలియాలి అని అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన చింతా ముత్యాలరావు రచించిన ‘నల్లగొండ జిల్లా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులు’ పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా Tఅయన మాట్లాడుతూ ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి రాజకీయ ప్రత్యర్థులను, ప్రజాస్వామ్య శక్తులను, విభిన్న అభిప్రాయాలను ఎలా అణచివేశారో భావితరాలు తెలుసుకోవాలన్నారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అధికారాన్ని కాపాడుకోవడానికి ఆమె ఎమర్జెన్సీ విధించారని, ఈ చారిత్రక నిజం యువతకు తెలియాలని అన్నారు. రాజ్యాంగాన్ని తమ స్వార్థం కోసం మార్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అలవాటు ఆ పార్టీకి ఉందని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ బీహార్ ప్రెస్ బిల్లును తీసుకొచ్చి పత్రికా స్వేచ్ఛను అణచివేయాలని ప్రయత్నించారని, ఎమర్జెన్సీ ముగిసి మళ్లీ అధికారంలోకి వచ్చినా అదే ధోరణి కొనసాగించారని రామచందర్‌రావు విమర్శించారు. పత్రికల గొంతు నొక్కే ప్రయత్నాలను తాము అప్పుడు ఎదిరించామని, ఇప్పటికీ ఎదిరిస్తామని చెప్పారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ కాలంలో జరిగిన దారుణాలను పాఠ్యాంశాల్లో చేర్చే ప్రయత్నం చేశారన్నారు. ఔరంగజేబు, షాజహాన్, నిజాం గురించి చరిత్రలో చెబుతారు.. వారు చేసిన మంచిచెడులను వివరిస్తారు.. అలాగే దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిన వారిని గురించి కూడా చరిత్రలో చెప్పాల్సిందేనన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ్ కార్యకర్తలను, విద్యార్థులను, న్యాయవాదులను అరెస్టు చేశారు.. జడ్జిలపై ఒత్తిళ్లు తెచ్చారు.. స్వతంత్ర ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరినీ అణచివేయడానికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన సినీ నటుడు దేవానంద్ సినిమాల విడుదలకు కూడా ఆటంకాలు కల్పించారని, ఇందిరాగాంధీకి మద్దతుగా పాటలు పాడనని చెప్పడంతో కిషోర్ కుమార్ పాటలను ఆకాశవాణిలో నిషేధించారని, ఆయన సినిమాలపై కూడా ఆంక్షలు విధించారని తెలిపారు. ఇంతటి ఘోరాలు జరిగినప్పటికీ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పలేదన్నారు. 400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపణలు చేశారని, కానీ రాజ్యాంగాన్ని కాపాడటంలో తమకు నిబద్ధత ఉందని ఆయన చెప్పారు. ఈరోజు మనం ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లో ఆదరణ పొందుతున్నామంటే ఎమర్జెన్సీ సమయంలో దేశం కోసం పోరాడిన యోధుల త్యాగాల వల్లేనన్నారు. వారిని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిదీ అన్నారు. వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయాలన్నారు. సాంబమూర్తి, చంద్రమోహన్, మలేశం, మురళి, సురేష్ రెడ్డి, కట్టా రాంచందర్, మరెంతోమంది త్యాగాలు అసాధారణమైనవన్నారు. ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో మురళి, భాస్కర్, మలేశం, సాంబమూర్తి బృందం చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ తరం మీడియా ప్రతినిధులు ఆ రోజుల్లో జర్నలిస్టులను ఎలా వేధించారో, పత్రికల గొంతును ఎలా నొక్కారో అధ్యయనం చేయాలని రామచందర్‌రావు సూచించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని కాంగ్రెస్ పార్టీని అడగాలన్నారు. అలాగే మళ్లీ ఎప్పటికీ ఇలాంటి పరిస్థితులు రాకుండా రాజ్యాంగాన్ని కాపాడతామనే భరోసా దేశ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *