– త్వరలో మహిళా శక్తి సూపర్ బజార్లు, గోదాములు, రైస్ మిల్లులు
– 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకి వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2034 నాటికి కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చేశారు. మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుంది.. కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుంది.. గ్రామం బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. సచివాలయం వేదికగా ఎనిమిది వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించిందని, వడ్డీ లేని రుణాలకు ఇప్పటికే రూ.1,390 కోట్లను చెల్లించిందని చెప్పారు. మహిళా సంఘాలు ఇకపై చిన్నచిన్న ఉపాధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పెద్ద వ్యాపారాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రైస్ మిల్లులు, మండలస్థాయిలో గోదాములు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలని సూచించారు. వాటికి అవసరమైన భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్ర పెరగాలని కోరారు. సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారులుగా ఉంటారని, వారి చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తే పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు నెలకొల్పాలని సీఎం సూచించారు. డీమార్ట్, బిగ్‌బజార్‌లకు పోటీగా ఉండేలా అద్భుతమైన మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలంటూ పట్టణాల్లో తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రావాలి.. రైతుల ఉత్పత్తులకు మార్కెట్ దొరకాలి.. మహిళా సంఘాలకు ఆదాయం రావాలి అన్నదే ఈ ఆలోచన వెనుక ఉన్న లక్ష్యమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా శక్తి సూపర్ బజార్లలో వాటాదారుగా ఉంటుందని, రైతులు పండించే మంచి పంటలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, నిత్యావసర సరకులు వీటి ద్వారా వినియోగదారులకు చేరేలా చూడాలని అన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తే రైతులకు మేలు జరుగుతుందని, వినియోగదారునికీ నాణ్యమైన వస్తువు, మహిళా సంఘాలకూ ఆదాయం లభిస్తుందని చెప్పారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే దిశగా ఇది చారిత్రక కార్యక్రమమని సీఎం అన్నారు. అదే వేదికపై చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను కూడా సీఎం ఆవిష్కరించారు. ఒకే రోజు ఒకే సమయంలో ఎనిమిది వేల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని అన్నారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు ఉండటం అంటే కేవలం సమావేశాల స్థలం ఇవ్వటం కాదని, వారి ఆర్థిక కార్యకలాపాలకు, శిక్షణకు, వ్యాపార ప్రణాళికలకు శాశ్వత వేదికను నిర్మించడమని చెప్పారు. మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి మార్గమని భావించి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ పథకంలో ఆర్టీసీకి రూ.10 వేల కోట్ల వరకు చెల్లించినట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అడ్డుకునేందుకు కొదరు కుట్రలు చేశారని విమర్శించారు. అయితే మహిళల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదŠని అన్నారు. మహిళలను బస్సులను యజమానులుగా మార్చాలన్న ఆలోచనతో మహిళా సంఘాల ద్వారా వెయ్యి బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రణాళికను అమలు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా జూన్ 5న పరేడ్ గ్రౌండ్‌లో 553 బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సోలార్ ఎనర్జీ అనగానే అదానీ, అంబానీ వంటి పెద్ద సంస్థలే గుర్తుకు వచ్చే పరిస్థితి మారిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. పెట్రోల్ బంకుల వ్యాపారంలోనూ సంఘాలను భాగస్వాములుగా చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల సమాఖ్యలతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంక్ ద్వారా తాము ఇప్పటివరకు దాదాపు రూ.27 లక్షలు సంపాదించామంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు. మహిళా సంఘాలు చేపడుతున్న కొన్ని వ్యాపారాల్లో నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయన్నారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా బ్యాంకులకు వందకు వంద శాతం తిరిగి చెల్లించిన నిర్మల్ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మెయిన్ రోడ్డులో వారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
చిలుక పచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు 
రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె లాగా ఇందిరమ్మ చీరలు అందజేస్తోందని అన్నారు. గతంలో ఇచ్చిన చీరలు నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలను తరిమేందుకు ఉపయోగించారనే విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని, ఈసారి చిలుకపచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు ఇవ్వబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైౖర్మన్లు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, ఎండోమెంట్స్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య, మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



