-పేర్లు వేరు అయినా బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే
– కొడంగల్‌లో 1,96,620 ఓట్లు ప్రక్షాళన
– ఇంకా 22 శాతం మంది నమోదు చేసుకోలేదు
– వారి ఓట్లన్నీ నమోదు చేయించాలి
– ఎస్ఐఆర్ పై బీఎల్ఏల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 22 : కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే తనకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో తనను దెబ్బతీయాలంటే కొడంగల్‌లోని తన పునాదులు కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు.పేర్లు వేరైనా బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. ఎస్ఐఆర్ ఫారంలో వివరాలు నమోదు చేసుకున్న అనంతరం ఆ కార్యక్రమంపై కార్యకర్తలు, నాయకులు, బీఎల్ఏలకి బుధవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కొడంగల్‌లో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని చూస్తున్నారని, ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటకు రాకుండా ఉంటారని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎదురు నిలబడలేక దొంగదెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారన్నారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు రోజుకు 18 గంటలు పనిచేసినా తనకు సమయం సరిపోవడంలేదన్నారు. కొడంగల్‌లో కుట్రలు చేసేవారిని బొంద పెట్టే బాధ్యత మీపై ఉందని అన్నారు. ఆగస్టు 3 వరకు ఎస్ఐఆర్ గడువు ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో ఇప్పటివరకు 1,96,620 ఓట్లు ప్రక్షాళన అయ్యాయని, ఇంకా నమోదు చేసుకోనివారి సంఖ్య 54,635 అంటే మొత్తం ఓట్లలో ఇంకా 22 శాతం ఉందని ఆయన తెలిపారు. ఆ ఓట్లను తొలగించే ప్రమాదం పొంచి ఉందని, వారందరినీ తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పారు. ఓటు పోగొట్టుకుంటే గుర్తింపు ఉండదు.. కార్యకర్తగా ఇంటింటికీ వెళ్లి ఓటరు వెరిఫికేషన్ ఫారం నమోదు చేయించాలి అని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లు తొలగించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓటర్ల వివరాలను ఎన్నికల అధికారులకు అందించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లపైనే ఉందన్నారు. ఈ నెల 30లోగా నూటికి నూరు శాతం నియోజకవర్గంలో ప్రక్షాళన పూర్తి కావాలని, అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు కోల్పోవడానికి వీల్లేదని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





