- కొండ చరియలు విరిగి పడి పలువురు గల్లంతు
– వరదలతో ఇప్పటికే పలువురు మృతి
శ్రీనగర్, జూలై 21: జమ్మూకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా సరిహద్దు జిల్లాలైన పూంఛ్, రాజౌరీల్లో ఇప్పటికే 12 మంది మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. రోడ్లు, ఇళ్లుసహా పలు ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాలు చాలావరకు దెబ్బతిన్నాయి. దీంతో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోమవారం దిల్లీలో రాష్ట్ర హోదా కోసం తలపెట్టిన ఆందోళనను విరమించుకుని జమ్మూకు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. పూంఛ్ జిల్లాలోని సురన్‌కోట్ తెహసీల్ ప్రాంతంలో ఎక్కువ విధ్వంసం జరిగింది. ఇక్కడే అధికంగా 10 మరణాలు సంభవించాయి. 9 మృతదేహాలు లభ్యమైనప్పటికీ.. కనీసం 16 మృతి చెంది ఉండే అవకాశం ఉందని పూంఛ్ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ శర్మ తెలిపారు.జమ్మూ కశ్మీర్‌లోని రియాస్ జిల్లాలో వర్షాలవల్ల మాతా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. సురన్‌కోట్ తెహసీల్ ప్రాంతంలో సంభవించిన మేఘ విస్ఫోటం మహమ్మద్ లతీఫ్ అనే ఒక వ్యక్తి జీవితంలో ఊహించనంత విషాదాన్ని నింపింది. భారీ వర్షం కారణంగా ఆయన తన వాహనాన్ని సురక్షిత ప్రాంతంలో పార్క్ చేయడానికి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి.. ఆయనకు చెందిన మూడంతస్తుల భవనం మట్టి, బురదలో కూరుకుపోయింది. దీంతో అందులోని 8 మంది కుటుంబసభ్యులు మరణించారు. లతీఫ్‌తో పాటు అతని పెద్ద కుమారుడు మాత్రమే బతికి బట్టకట్టారు. ప్రమాదం సమయంలో లతీఫ్ కుమారుడు జమ్మూలో ఉన్నారు.
అసోంను ముంచెత్తిన వరదలు : పదిమంది మృతి 
గౌహతి, జూలై 21:అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలకు అస్సాం రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 794 గ్రామాలు ప్రభావితమయ్యాయి. శివసాగర్, చరైడియో, జోర్హాట్, దిబ్రూఘర్, సోనిత్‌పూర్, బిస్వనాథ్, గోలాఘాట్, ధేమాజీ, తిన్‌సుకియా, నాగావ్, కర్బీ అంగ్లాంగ్, కాచర్, ఉదల్‌గురి, చిరాంగ్, కమ్‌రూప్, కమ్‌రూప్ (మెట్రో) జిల్లాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఆయా జిల్లాల్లో మొత్తం 3.62 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అధికారులు 101 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో నదులకు వరదనీరు పోటెత్తుతోంది. నేమతిఘాట్ వద్ద బ్రహ్మపుత్ర, చెనిమారి (ఖోవాంగ్) వద్ద బుర్హిదిహింగ్, నాంగ్లామురాఘాట్ వద్ద దిసాంగ్, నుమాలిగఢ్ వద్ద ధన్‌సిరి (దక్షిణ), శివసాగర్ వద్ద దిఖౌ నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వరదనీరు జనావాసాల్లోకి వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షాలకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 19,100 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. మరోవైపు, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు చెరువులు, నదుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు అధికారుల హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





