అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెదవి విరుపు
ఇజ్రాయెల్Iఇరాన్ మధ్య మళ్లీ దాడులు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని నియంత్రించడంలో తన పాత్ర చాలా పరిమితమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడిరచారు. శనివారం ఉదయం ఇరాన్, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసుకోగా యుద్ధం తొమ్మిదవ రోజులోకి ప్రవేశించింది. యూరోప్ నేతృత్వంలో జెనీవాలో జరిగిన డిప్లమాటిక్ చర్చల విషయంలో ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. ‘యూరప్ వల్ల ఏమీ కాదు.. యూరోప్‌తో కాదు.. మనతోనే మాట్లాడాలని ఇరాన్ అనుకుంటోంది’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై దాడులు ఆపించాలని తాను ఒత్తిడి చేయలేనని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంలో ఇజ్రాయెల్ బాగానే ముందుంది. ఇరాన్ అంతగా కాదు. ఆపమని చెప్పడం అంత సులభం కాదు అని అన్నారు. జెనీవాలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ విదేశాంగ మంత్రులు పాల్గొన్న చర్చలు మూడు గంటలపాటు కొనసాగినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ట్రంప్ మరోవైపు తనను తాను శాంతి దూతగా భావిస్తున్నట్లు చెప్పుకున్నా యుద్ధానికి ముగింపు తెచ్చేది అమెరికా-ఇరాన్ మధ్య నేరుగా జరిగే చర్చలే అని పేర్కొన్నారు. యూరప్ ఉపయోగపడదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఇరాన్ టాప్ డిప్లమాట్ అబ్బాస్ అరఘచీ మాట్లాడుతూ దాడి చేసిన దేశాన్ని న్యాయస్థానంలో నిలిపిన తరువాతే తాము చర్చలకు తిరిగి వస్తాం అని స్పష్టం చేశారు.
తాజా దాడులు
ఇరాన్ ఇజ్రాయెల్‌పై శుక్రవారం క్షిపణి దాడులు చేసింది. హైఫా సహా అనేక నగరాలు దాని లక్ష్యంగా మారాయి. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణు కేంద్రాలకు సంబంధించి క్షిపణి ఫ్యాక్టరీలు, పరిశోధన సంస్థలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ కథనం ప్రకారం ఇరాన్ నుంచి ప్రయాణించిన 35 క్షిపణుల్లో ఒకటి హైఫా నగరంలోని ఖాళీ భవనాన్ని ఢీకొట్టి చుట్టుపక్కల భవనాలకు, మసీదు సమీపంలో తీవ్ర నష్టం కలిగించింది. మరోవైపు, ఇరాన్ ఉత్తర తీరంలోని కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఓ పరిశ్రమ సముదాయాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లు అక్కడి ప్రసార సంస్థ తెలిపింది.
శుక్రవారం మధ్యాహ్న ప్రార్థనలు అనంతరం ఇరాన్, ఇరాక్, లెబనాన్ దేశాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. టెహ్రాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కాళ్లతో తొక్కి తగలబెట్టారు.
తర్వాత ఏమవుతుంది?
ట్రంప్ నిర్ణయిస్తే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా బాంబర్లను పంపించవచ్చు. ఈ బాంబర్లు ఇరాన్‌లోని యురేనియం శుద్ధీకరణ కేంద్రాన్ని ధ్వంసం చేయగలవు. అలాంటి పరిణామం యుద్ధాన్ని మరింత ప్రమాదకర దశలోకి నెట్టే అవకాశముంది.