‘సర్’.. అంద‌రూ అప్రమత్తంగా ఉండాలి

– నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదులుకుంటాం
– ఎమ్మెల్యేలు అయినా స‌రే ప‌నిచేయాల్సిందే
– ఇన్‌చార్జి మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలి
– బీజేపీ రాజకీయ కుట్రలకు తెరతీస్తోంది
– పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: రాష్ట్రంలో గురువారం నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) ప్రారంభం కానుండడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో బుధవారం నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులను క్షమించేది లేదని హెచ్చరించారు. దీనిపై సర్పంచ్‌లతో గ్రామాల్లో ప్రచారం చేయించాలని సూచించారు. ఈ విషయంలో పలువురు ఎమ్మెల్యేలు సీరియస్‌గా లేరని, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’ పేరిట బీజేపీ కుట్ర చేస్తోందని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని అన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉంటూ మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తనకూ ఒక నియోజకవర్గం కేటాయించాలని సీఎం కోరారు. ఎమ్మెల్యేల తీరు మారితే ఓకే.. వారం రోజుల్లో తీరు మారకపోతే వారి స్థానంలో యాక్టివ్‌గా ఉన్న మరో వ్యక్తిని ఇన్‌చార్జిగా నియమిస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయని వాళ్లు పార్టీకి అవసరం లేదని తేల్చిచెప్పారు. పార్టీలో ఏ పదవిలో ఉన్నా ‘సర్’ విషయంలో క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాల్సిందేనన్నారు. ‘ఎవరెవరు పని చేయడం లేదో నా దగ్గర రిపోర్టు ఉంది.. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే విÖటింగ్‌లో పేర్లు చెప్పాల్సి వస్తుంది.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని అన్నారు. ఇన్‌చార్జి మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, పనిచేయకపోతే వారిని కూడా మారుస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎస్‌ఐఆర్ పక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, బూత్‌స్థాయి నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ఓటర్ల హక్కులను కాపాడటంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ వ్యూహాలను గమనించాలని సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల నిర్వహణ విషయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. లౌకికవాద ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరిగే ప్రమాదం ఉందని, ప్రతి అర్హత కలిగిన ఓటు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత కీలకంగా పని చేయాలని ఆయన సూచించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం సబబు కాదంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా తీరు మారాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలని ఆదేశించారు. గద్వాల, మల్కాజిగిరి, భువనగిరి, నిజామాబాద్‌లో వీక్‌గా ఉన్నామని మహేష్‌కుమార్ చెప్పారు. ఓటు హక్కు రాజకీయాల కోసం మాత్రమే కాదని మీనాక్షి నటరాజన్ అన్నారు. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఓటు హక్కు కూడా అంతే అవసరమన్నారు. ఓటు అనేది ప్రతి మనిషికీ సోషల్ స్టేటస్ అని చెప్పారు. ఎంతో కష్టపడితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓటు హక్కు వచ్చిందని తెలిపారు. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత అందరిది అని ఆమె చెప్పారు. విÖటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *