కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం కుదరదు

– మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉంచాలని ఎన్‌డిఎస్‌ఎ ఆదేశాలు
– గేట్లు మూస్తేనే నీరు ఎత్తి పోయడానికి అవకాశం
– ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈటల వ్యాఖ్యలు
– బిఆర్‌ఎస్‌ ‌నేతల సూచనలతోనే మాట మార్చిన ఈటల
– జలశక్తి మంత్రిత్వ శాఖను కలిసి అనుమతి తెస్తే అభ్యంతరం లేదు
– ఈటల, బిఆర్‌ఎస్‌ ‌నేతలకే నిర్వహణ బాధ్యత అప్పగిస్తా
– మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌స్షష్టీకరణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 11: కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సూచనల మేరకే ఎంపీ ఈటల రాజేందర్‌ ‌మాట్లాడారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఎంపీ ఈటల అవాస్తవాలు చెప్పారని ధ్వజమెత్తారు. ఆయన‌ అంటే తమకు గౌరవమేనని, ఆ వ్యాఖ్యలతో ఈటల తన గౌరవం పోగొట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు.శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో వర్షాల వల్ల గోదావరిలో పారుతున్న నీళ్లను ఎత్తిపోయాలని బీఆరెస్ నేతలు మాట్లాడుతున్నారని, ఈటల కూడా కన్నెపల్లి నుంచి ఎత్తిపోయాలని మాట్లాడుతున్నారంటూ ఆయనంటే గౌరవం ఉన్నా హరీష్‌రావు సూచనల మేరకు మాట్లాడిన ఆయన మాటలపై గౌరవం లేదని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నుంచి కానీ, ఎన్డీఎసఏ అధికారులనుంచి కానీ వివరాలు తెలుసుకుని మాట్లాడితే ఆయన గౌరవం మరింత పెరిగేదన్నారు. 2019 జూన్ 29న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని, 2020 మే 18న మేడిగడ్డ బ్యారేజీలో లోపాలున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణారావు లేఖ రాశారన్నారు. 11 నెలల్లోనే మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయని, సమస్యను పట్టించుకోకపోవడంతో అది పెరిగి పెద్దదై కుప్పకూలే స్థితికి చేరిందని రేవంత్ చెప్పారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగిపోయిందని, మరుసటి రోజే ఇంజనీర్లు దీనిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారని, ప్లానింగ్, డిజైనింగ్, ఆపరేషనల్ మెయింటెనెన్స్‌లో లోపాలున్నాయని 2023 నవంబర్ 1న ఎన్డీఎసఏ నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. ఎన్డీఎసఏ మా దగ్గరికే ఎందుకొచ్చిందని వాళ్లు మాట్లాడుతున్నారు.. దేశంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 డిసెంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిందని, ఆ చట్టం ప్రకారం ఎక్కడైనా నిర్దేశిత డ్యామ్‌ల పర్యవేక్షణ, నిర్వహణ, తనీఖీలు ఆ సంస్థ చేయొచ్చునని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఎన్డీఎసఏ మేడిగడ్డను సందర్శించిందని, 7వ బ్లాకు దెబ్బతినడం వల్ల బ్యారేజీలో నీళ్లు నింపితే ప్రమాదమని ప్రాథమిక నివేదికలో చెప్పిందని, వివిధ పరీక్షలు, క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం పది నెలల తర్వాత ఎన్డీఎసఏ తుది నివేదిక ఇచ్చిందని, అందులోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చిచెప్పిందని వివరించారు. 346వ పేజీలో మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజీ నుంచి నీటి మళ్లింపునకు పనికి రాకుండా పోయిందని తెలిపిందని, 352వ పేజీలో అన్నారం బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిందని, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పిందని తెలిపారు. 356వ పేజీలో సుందిళ్ల బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటి మళ్లింపు సురక్షితం కాదని నివేదించిందన్నారు. ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17వ పాయింట్‌లో మూడు బ్యారేజీల తీవ్ర నష్టాలను క్రోడీకరించిందని, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసిందని సీఎం చెప్పారు. ‘మొత్తం బ్యారేజీ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను సిఫారసు చేసింది.. పునరుద్ధరణ డిజైన్లు, మరమ్మతులు, ఇతర పనులన్నీ ఎన్డీఎసఏ లేదా సీడబ్ల్యుసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎసఏ సిఫారసు చేసింది’ అన్నారు. ప్రవాహం ఉండటం వేరు. పంపింగ్‌కు అవసరమైన నీటిమట్టం ఉండటం వేరు అంటూ అక్కడ కనీస పంపింగ్ లెవల్ 93.50 మీటర్లు కావాలని, ప్రస్తుతం 89.90 మీటర్లే ఉందని, అన్నారం, సుందిళ్లలో కూడా గేట్లు మూస్తే తప్ప చుక్క నీరు నిల్వ ఉండదని తెలిపారు. ఆ బ్యారేజీలు భద్రంగా లేవని, అందువల్ల గేట్లు మూసి నీటిని నిల్వ చేయరాదని ఎన్డీఎసఏ ఇప్పటికే స్పష్టంగా సూచించిందన్నారు. అలాంటప్పుడు నీళ్లు ఎత్తిపోసేయండి అని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. మేడిగడ్డ బెడ్ లెవల్ 88.50 మీటర్లు. క్రెస్ట్ లెవల్ 89.50 మీటర్లు. అక్కడనుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి (లక్ష్మి) పంప్ హౌస్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలంటే కావాల్సిన పంపింగ్ లెవల్ 93.50 మీటర్లు ఉండాలని చెప్పారు. మేడిగడ్డ వద్ద ప్రవాహం ఉన్నా నీటిమట్టం పంపింగ్ చేసే స్థాయి 93.50 మీటర్లు లేదని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్దా ఇదే పరిస్థితి ఉందని అన్నారు.

కన్నెపల్లి నుంచి ఎత్తిపోసినా అవి మేడిగడ్డకు రావాల్సిందే

కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసినా అక్కడ గేట్లు ఓపెన్ ఉన్నందున అవి కూడా మళ్లీ మేడిగడ్డకు రావాల్సిందేనన్నారు. ఎన్డీఎసఏ సిఫారసు మేరకు అక్కడ గేట్లు మÖసేందుకు వీల్లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రత్యేక సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు. 2026 జూన్ 30న ఈ కమిటీ వేసిందని, మూడు బ్యారేజీల వద్ద నిర్మాణపరమైన సమస్యలున్నాయని ఇందులో కూడా స్పష్టం చేసిందిదన్నారు. మూడు బ్యారేజీల డిజైన్, పునరుద్ధరణ ప్రతిపాదనలకు సాంకేతిక సలహాలు ఇవ్వడంతోపాటు విచారణలు, నిర్మాణ పనులు, నాణ్యత నియంత్రణ, ఏమైనా మార్పులు చేస్తే ఈ కమిటీకి తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పారు.

కేసీఆర్ కమిటీ వేసుకున్నారు

రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్డీఎసఏ కమిటీ సూచనలు పాటిస్తుంటే కేసీఆర్ వైపు నుంచి కిలాడీల కమిటీ ఏర్పాటు చేసుకున్నారని, ఆ కమిటీలో కేసీఆర్ చైర్మన్, హరీష్, కేటీఆర్ సభ్యులుగా ఉన్నారని, ఇపుడు ఈటెల కూడా అందులో సభ్యులుగా చేరారని వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైలుకు పంపితే వాళ్లు చేసిన అప్పులెంటో, తప్పులేంటో తెలిసేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎసఏ సూచనల ప్రకారం ప్రాజెక్టు పునరుద్ధరణపై ముందుకు వెళుతుందని, ఈ కిలాడీ ముఠాను కమిటీని ఎన్డీఎసఏ కమిటీ వద్దకు తీసుకెళ్లి ఈfల ఒప్పిస్తే తాము కూడా ముందుకు వస్తాం అన్నారు. కమీషన్లు బొక్కిన సంగతి తెలిసి ఆనాడు నిన్ను మీ మామ పక్కనబెట్టారు.. కమీషన్ల కక్కుర్తితో ఇప్పుడు క్రషర్లను కూడా వదలడంలేదు.. ఆంధ్రా సంస్థలని ఆనాడు విమర్శించిన నారాయణ, చైతన్య సంస్థలకు పాలు పోసి బతుకుతున్నావు.. నీదీ ఒక బతుకేనా అని హరీష్‌రావునుద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆరెస్ హయాంలో పట్టిసీమకు 105 టీఎంసీలు తరలించినపుడు హరీష్ రావు గాడిదలు కాశారా అని నిలదీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వినియోగంలోకి వస్తే పోలవరంనకు నీళ్లు పోవని చెప్పగలరా అని ప్రశ్నించారు.

రెండు డిమాండ్లు మీ ముందుంచుతున్నా

రెండే రెండు డిమాండ్లు ఈfల ముందుంచుతున్నా.. ఎన్డీఎసఏను కలిసి నీళ్లు ఎత్తిపోయాలని చెప్పండి ఆ కమిటీకి తాము సంపూర్ణంగా సహకరిస్తాం అని సీఎం రేవంత్ అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణను తమ ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ 2025 సెప్టెంబర్ 1న జీవో నెం.104 జారీ చేసిందని, సీబీఐ వద్ద మూలుగుతున్న ఈ కేసుపై విచారణ ముందుకు తీసుకెళ్లేలా చేయండి.. ఇప్పటికీ విచారణ ఎందుకు వేగంగా సాగడం లేదో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *