– గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ వేతనాలపై పట్టింపేది?
– మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్‌లో తొమ్మిది నెలలుగా జీతాలు రాక ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిష్టి కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. నెలల తరబడి జీతాలు పెండిరగ్‌లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుంది.. కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఓపిక నశించి కళాశాలకు వెళ్లకూడదని నిర్ణయించున్నారని తెలిపారు. లెక్చరర్లు కళాశాలలకు వెళ్లకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు.. సిలబస్‌ను ఎవరు పూర్తి చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్ల లెక్చరర్లే కాదు విద్యార్థులు కూడా నష్టపోవాల్సి వస్తున్నదని, పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని ప్రభుత్వం ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుంది అని వ్యాఖ్యానించారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి ఇంకెంత దారుణమో ఊహించుకోవచ్చునన్నారు. రేవంత్ రెడ్డి గారూ.. కోతలు కోయడం ఆపేసి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై దృష్టి సారించండి.. మీ సొంత జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెండిరగ్‌లో ఉన్న ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే విడుదల చేసి మీ పరువు కాపాడుకోండి అని హరీష్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





