– ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఏదీ?
– ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్ధతు ప్రకటించాయని, ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతోందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 22 నుంచి తలపెట్టిన సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన పక్రియ ఇప్పటికీ మొదలుపెట్టలేదని, కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని విమర్శించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారు కానీ ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలక్టిక్రల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్‌పరం చేయాలనే ఆలోచన చేస్తున్నారని, హైదరాబాద్‌లో ఆర్టీసీ లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని, సంస్థ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని, హైదరాబాద్ డిపోల్లోని ఉద్యోగులను జిల్లాలకు పంపే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని అడుగుతున్నా పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పని పరిస్థితుల్లోనే సమ్మె చేస్తున్నామన్నారు. సమ్మె చేయకుండా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎవరూ భయపడొద్దని, కార్మికులు అందరూ సమ్మెకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లటానికి జేఏసీ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
సమ్మె ఆలోచన విరమించండి, చర్చలకు సిద్దమే : మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను వెంటనే విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మికులకు స్పష్టం చేశారు. ఆర్టీసి బలోపేతానికి తాము కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు ప్రయాణికుల దృష్టిలో ఆలోచించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఉన్నారని, ఇప్పటికిప్పుడు చర్చకు తాము సిద్ధమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రాను రద్దు చేస్తామంటే కబ్జాదారులకు మద్దతు ఇవ్వడమేనని పొన్నం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ పథకం మహాలక్ష్మి వద్దని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొనడం పట్ల పొన్నం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిది కాదని అన్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, టీడీపీ నేతలు, జనసేన అధినేత వ్యాఖ్యలు సముచితంగా లేవన్నారు. రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు విద్వేషాలు రగిలించేలా ఉన్నాయన్నారు. విభజనపై ఎంపీ తేజస్వి వ్యాఖ్యల విషయమై స్పీకర్‌కు లేఖ రాయాలని, ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేలా చూడాలని కోరారు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో సాగడం తక్షణ అవసరం అని లేఖలో పొన్నం పేర్కొన్నారు. తన వినతిని అర్థం చేసుకుని తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





