– రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత
– పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: ఎండల తీవ్రతతో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారగా నెల రోజులుగా ఆయా ప్రాంతాల్లో విభిన్న వాతావరణం ఉంటోంది. కొన్నిచోట్ల అకాల వర్షాలు, పలుచోట్ల వడగళ్ల వర్షం, ఇప్పుడు వడగాడ్పులు చోటుచేసుకుంటున్నాయి. భానుడి భగభగలతో జనం మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్ళలేక ఉన్నచోటనే ఇంట్లోనో, కార్యాలయంలోనో ఉండిపోతున్నారు. అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌తోపాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపి ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాడ్పలు వీచే అవకాశం ఉందని, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాలకు యెల్లో అలెర్ట్ జారీ చేశారు. కాగా, ఎండ వేడిమిని తట్టుకోలేని పరిస్థితులు ఎదురవుతుండగా ఇప్పటికే రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈనెల 19 నుంచి మే 31 వరకు ప్రత్యేక వాతావరణం చూస్తామని, ఈ కారణంగా కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. వడగాడ్పులు సాధారణ రోజులకన్నా ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఉష్ణోగ్రత 45 నుండి 55 డిగ్రీల వరకు చేరొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో వైద్యులు, శాస్త్రజ్ఞులు సైతం మానవ సహిత జీవజాలాన్ని, జంతు జాలాన్ని వేడి వాతావరణంలో ఎలా రక్షించుకోవాలో సూచిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఎవరూ బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉక్కపోత అధికంగా ఉంటుందని, గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్ల వడ దెబ్బ తగిలే అవకాశం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. 40-45 డిగ్రీలకు చేరుకుంటే ప్రమాదస్థాయి మరింతగా పెరుగుతుంది. గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. రామగుండం, భద్రాచలం వంటి కొన్ని ప్రాంతాల్లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45-47డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అందువల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకినప్పటి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎల్‌నినో కాస్త ముందే పలకరించినా భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహా సముద్రం వేడెక్కుతుంది. చివరిసారిగా ఎల్‌నినో పరిస్థితులు 2023లో ఏర్పడ్డాయి. ఈ ఏడాది రుతుపవనాల సమయంలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎల్‌నినో ప్రభావంతో దేశంలో నీటి వనరులకు కొరత ఏర్పడుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





