– రైతు ఆశీర్వాద సభ సక్సెస్
– మధిర గడ్డపై సీఎం రేవంత్ తొలి అడుగు
– అవినీతి రక్కసిపై కాంగ్రెస్ సమరశంఖం
– బీఆర్ఎస్ పాలనఫై నిప్పులు చెరిగిన సీఎం, డిప్యూటీ సీఎం
– రైతు ఆశీర్వాద సభకు జననీరాజనం
చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 10 : ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కెపల్లి క్రాస్ రోడ్, జగన్నాధపురం వేదికగా శుక్రవారం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. సుమారు రెండు లక్షల మంది రైతులు, ప్రజల కడలి తరలివచ్చి సభను విజయవంతం చేయడంతో జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ సరికొత్త ఉత్సాహాన్ని పుంజుకుంది. మధిర గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి అడుగు పెట్టడంతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వెల్లివిరిసింది. ఈ సభను దిగ్విజయం చేయించడం ద్వారా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనదైన ముద్రను వేస్తూ, ‘గట్టి విక్రమార్క’గా తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు. ప్రజా ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనంగా, కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 9,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 
ఈ సభ కేవలం ఒక రాజకీయ సమావేశం మాత్రమే కాదు, కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాద పత్రంగా నిలిచింది. ఇది ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలను కైవసం చేసుకోవడానికి పునాది అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు నాటి బీఆర్ఎస్ పాలనలోని అవినీతిని గణాంకాలతో సహా ఎండగట్టిన తీరు ప్రజలను, కార్యకర్తలను విపరీతంగా ఆకట్టుకుంది. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరకుండా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ ‘ఆధునిక దేవాలయాలుగా’ నిలుస్తున్నాయని గుర్తుచేశారు. దీనికి భిన్నంగా, బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రూ. 27,000 కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును, రూ. 1,40,000 కోట్లకు పెంచి, చివరికి అది ‘కూలేశ్వరం’గా మారిందని నేతలు ఘాటుగా విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కనీసం 10 టీఎంసీల నీటిని కూడా మోయలేక కుప్పకూలడం, గత పాలకులు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో తెలియజేస్తోందని వారు గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ హయాంలో అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని, సంక్షేమ పథకాలతో పాటు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నామని నేతలు స్పష్టం చేశారు. అబద్ధపు ప్రచారాలు, ఫాంహౌస్ రాజకీయాలతో రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చూస్తున్న వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను మార్చడమే లక్ష్యమని, దోపిడీదారులకు, గుంటనక్కలకు రాష్ట్రంలో చోటులేదని వారు హెచ్చరించారు. ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకం మరింత బలపడింది. అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ రైతు ఆశీర్వాద సభ చాటి చెప్పింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జైత్రయాత్రకు ఈ భారీ సభ ఒక గొప్ప మలుపుగా మారనుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సభ సైడ్ లైట్స్ 
* జగన్నాధపురం వేదికగా శుక్రవారం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ కు విశేష స్పందన లభించింది
* సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోలతో ప్లే కార్డుల ప్రదర్శన ఆకట్టుకుంది.
* హెలికాఫ్టర్ దిగిన తర్వాత స్టేజి వరకు సీఎం కాన్వాయ్ లో రాకుండా నడుచుకుంటూ వచ్చారు. దీనితో ఆయనకు అడుగడుగునా జన స్వాగతం పలికారు. దారి పొడవునా అక్కడ ఉన్న వారికి కరచాలనం, అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
* సభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకాటి శ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐ టి శాఖ మంత్రి శ్రీ ధర్ బాబు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘు రామ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, వెంకట్రావ్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మెన్లు, ఖమ్మం కలెక్టర్ దివాకర్, సీపీ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.
* జూబ్లీ హీల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పేరు చెప్పగానే సభలో జనాలు కేరింతలు కొట్టారు.
* సీఎం కు ఖమ్మం సభకు గుర్తుగా వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు.
*ఇక్కడి సభ ద్వారా రైతులకు 1009 కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులు జమ చేశారు. ల్యాప్ టాప్ లో సీఎం అకౌంట్ జమ ను అం చేశారు.
*సభలోని ఓ గ్యాలరీలో ఎల్ ఈ డి స్క్రీన్ వద్ద చిన్న విద్యుత్ వైర్ షార్టు కావడంతో ఫైర్ సిబ్బంది అప్రమత్తమై ప్రమాదం పెద్దది కాకుండా నిలువరించారు.
*టీడీపీ, వై ఎస్ ఆర్ సీపీ జెండాలతో సీఎం రేవంత్ఎం డిప్యూటీ సీఎం భట్టి భారీ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు.
*జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్ల కార్డులు ప్రదర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





