ప్రజా ప్రభుత్వానికి రైతుల మద్దతు

– ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.
– తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారుస్తాం
– బీఆర్ఎస్ నిర్మాణం చేసిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది
– ప్రాజెక్టుల రీడిజైన్ లో పేరిట రూ.1,50,000 కోట్లు దోపిడీ
– రాష్ట్రాన్ని దోచుకున్న గుంటనక్కలను వదిలేది లేదు
– రైతు ఆశీర్వాద సభలో గర్జించిన భట్టి విక్రమార్క
– 16.81 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1009 కోట్ల రైతు భరోసా

చింత‌కాని, ప్ర‌జాతంత్ర‌, జూలై10:  రాష్ట్రాన్ని కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా, ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.  మధిర నియోజకవర్గం జగన్నాధపురం క్రాస్ రోడ్ లో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. గత పదేళ్లలో జరిగిన దోపిడీలను ప్రస్తావిస్తూ, ఇకపై రాష్ట్రాన్ని ఆశ్రయించిన గుంటనక్కలను, తోడేళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని బాధ్యతాయుతంగా కాపాడుతూ, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతామని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తం గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారేనని, అందుకే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూనే రాష్ట్ర భవిష్యత్తు కోసం దార్శనిక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా, పారదర్శకమైన పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మారుస్తామని  స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలను మహాలక్ష్ములుగా గౌరవించడం, రైతన్నను రాజును చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఉద్ఘాటించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వడ్డీ లేని రుణాల పథకాన్ని పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విస్మరించారని, కానీ తాము అధికారంలోకి రాగానే మహిళల కోసం ఆ పథకాన్ని తిరిగి యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రెండున్నర సంవత్సరాల్లోనే సుమారు 67 వేల కోట్ల రూపాయలను మహిళలకు అందించామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, వడ్డీ లేని రుణాల పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామని, మహిళల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించామని గుర్తు చేశారు. పవర్ ప్రాజెక్టులు, పెట్రోల్ పంపులు, క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు వంటి రంగాల్లో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది, వారిని కోటీశ్వరులుగా చూడటమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కేవలం ఒక వృత్తిగా కాకుండా మన సంస్కృతిగా, జీవన విధానంగా భావిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు ఇచ్చే నిధులు ఉచితాలు కావని, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి అవసరమైన పెట్టుబడులని వివరించారు. గతంలో బి ఆర్ ఎస్ పాలకులు ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులను 140 నుంచి 160 రోజులలో ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారని, కానీ ఎకరానికి 12 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను  రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు.  తెలంగాణలో రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, గత రెండున్నరేళ్లలోనే వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశామని  తెలిపారు. జగన్నాధపురం వడ్డేపల్లి క్రాస్ రోడ్డులో లక్షలాది మంది రైతుల సమక్షంలో 9 నుండి 54 ఎకరాల భూమి ఉన్న 16 లక్షల 81 వేల మంది రైతుల ఖాతాల్లో ఈరోజు ముఖ్యమంత్రి  రూ. 1009 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 8 వేల ఎకరాలకు పైగా రైతులకు ఈ ప్రయోజనం చేకూరగా, ఈరోజు విడుదల చేసే నిధులతో 54 ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ లబ్ధి జరుగుతుందని వివరించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లోకి చేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని వారు పేర్కొన్నారు. రైతును రాజుగా చూడాలన్న లక్ష్యంతో రుణమాఫీ కింద రూ. 21 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడమే కాకుండా, సివిల్ సప్లై శాఖ ద్వారా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మొక్కజొన్న, జొన్న వంటి పంటలను పక్క రాష్ట్రాల్లో ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితుల్లో, తమ ప్రభుత్వం మార్కెట్ ధర కల్పించి రైతులకు అండగా నిలిచిందని  గుర్తుచేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పంట నష్టం జరిగినా రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, కానీ తమ ప్రజా ప్రభుత్వం క్రాప్ డ్యామేజ్ కింద రైతులకు ఆర్థిక సాయం అందించి ఆదుకుందని స్పష్టం చేశారు. రైతుల కోసం ఏటా రూ. 14 వేల కోట్ల ఉచిత విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా కరెంటు శాఖకు చెల్లిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఉచిత విద్యుత్ హామీ నిబద్ధతను చాటుకుంటోందని చెప్పారు.
కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా సుస్థిరంగా ఉంటే, లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేక విఫలమైందని విమర్శించారు. రూ. 27 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును రూ. 1,40,000 కోట్లకు పెంచి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుప్పకూలేలా చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని నేతలు ఆరోపించారు. “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ప్రాథమికంగా 38 వేల కోట్ల అంచనాలతో ప్రారంభమైన ప్రాజెక్టును, కేవలం 27 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తి కావాల్సింది. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును 1,40,000 కోట్లకు పెంచింది. ఇంతటి భారీ నిధులు ఖర్చు చేసినా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి ఒత్తిడిని తట్టుకోలేక కుంగిపోయాయి. కేవలం 10 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేయలేని స్థితికి ఈ ప్రాజెక్టు చేరుకోవడం బీఆర్ఎస్ అస్తవ్యస్త పాలనకు పరాకాష్ట” అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల మాటలను నమ్మితే రాష్ట్రం మళ్లీ సర్వనాశనం అవుతుంది” అని  హెచ్చరించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిని గ్రామాల్లోకి రాకుండా నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 8.21 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి వెళ్ళినా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని, అప్పులు తీరుస్తూనే సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని  స్పష్టం చేశారు.సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం గాలికి వదిలేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘రాజీవ్ కెనాల్’గా ప్రత్యేకంగా డిజైన్ చేసి, వంద కోట్ల పైగా నిధులతో పనులు వేగవంతం చేశామని నేతలు పేర్కొన్నారు. గోదావరి నది పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన వారు, నేడు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా, పేపర్ల సాక్షిగా తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఒకరు ఫాంహౌస్‌లో ఉంటూ, మరొకరు అబద్ధాల ప్రచారం చేస్తున్నార‌న్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రజలకు దిశానిర్దేశం చేస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారేనని, అందుకే గ్రామాల్లోని రైతుల కష్టాలు, బలహీన వర్గాల సమస్యలు తమకు బాగా తెలుసని వారు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి నేతలందరూ సమిష్టిగా, సోదరభావంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను మార్చడమే ధ్యేయమని, ఈ ప్రయాణంలో రాష్ట్ర ఆస్తులను, ప్రజా సంపదను కాపాడటానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *