4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్
విచారణ జరిగే కొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్18: ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు వెల్లడవుతోంది. తాజాగా ఈ కేసులో 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. 2023 నవంబర్ 15 నుండి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారట. ఇందులో తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్‌కు చెందిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, కోటింరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి వంటి నాయకుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ట్యాప్ చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ సహా అనేక పార్టీల కీలక నేతలు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ లక్ష్యంగా మారాయి. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. నిన్న ఒక్కరోజే తొమ్మిది మంది సాక్షుల స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. అందులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గద్వాల మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య, గాంధీ భవన్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారు. ఇవన్నీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిన ఆధారాలతో వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు పీసీసీ అధికార ప్రతినిధి జయపాల్ రెడ్డి సిట్ ముందు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. అదే విధంగా ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కూడా విచారించారు.
సిట్ కార్యాలయానికి ట్యాపింగ్ బాధితులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఫోన్ ట్యాపింగ్‌కు గురైన బాధితులకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి ఫోన్ ట్యాపింగ్ బాధితులు క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ అధికారుల నుంచి తన ఫోన్ ట్యాప్ అయినట్టు సమాచారం వచ్చిందని జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కరోజే 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఫోన్లు ట్యాప్ అయిన వారిని బాధితులుగా గుర్తించి వారికి సమాచారం ఇస్తున్నారు. ఈకేసులో సాక్షులుగా వారిచ్చే వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజులుగా పెద్ద మొత్తంలో బాధితుల నుంచి వాంగ్మూలాన్ని సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు కూడా మరికొందరు బాధితులు సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలాన్ని చ్చారు.