తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో భేటీ

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: రాజకీయాలకతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర పదేశ్‌ ప్రభుత్వం నిర్మించనున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్రంలోని పార్లమెంట్‌ సభ్యులతో రాష్ట్ర సచివాలయంలో బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హుఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశామని చెప్పారు. ‘తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్ర పభుత్వం 21-9-2016 అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసింది.. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్‌ ప్రతిపాదన ఇచ్చారు.. ఆ సమావేశంలో హరీష్‌రావు కూడా పాల్గొన్నారు. 13 ఆగస్టు 2019లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని నాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.. గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కెేసీఆర్‌, జగన్‌ ప్రగతి భవన్‌లో నాలుగుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటల రాజేందర్‌, బుగ్గన రాజేంద్రప్రసాద్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడిరచారు.. ఈ మీటింగ్‌ మినిట్స్‌ను రిఫరెన్స్‌గా చూపి ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ వివరించారు. ఇందుకు సమబంధించి అధికారిక పత్రాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బనకచర్ల అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి అపాయింట్‌మెంట్‌ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామన్నారు. పొలిటికల్‌ ఫైట్‌లో న్యాయం జరగకపోతే లీగల్‌ ఫైట్‌ చేద్దాం.. ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళదామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీల పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీ, రేణుకాచౌదరి, బలరాం నాయక్‌, మల్లు రవి, కుందూరు రఘువీర్‌ రెడ్డి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, డీకే అరుణ, రఘునందన్‌ రావు, సురేష్‌ షెట్కార్‌, రామసహాయం రఘురాంరెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page