మాజీ సీఎం చేతిలో మోసపోయిన ప్రజలకు అండగా ఉంటాం
రేపు మంజూరు పత్రాలు అందజేయనున్న మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : భవనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో ఇండ్ల నిర్మాణం పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. “వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు 2020 నవంబర్ 1న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఆనాడు ప్రకటించారు. 2021 జూన్ 22న గ్రామసభ నిర్వహించి స్ధానికులతో సహపంక్తి భోజనం చేశారు. బంగారు వాసాలమర్రిగా అభివృద్ది చేస్తానని, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ వాస్తవంగా ఆరోజు నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు వాసాలమర్రి వైపు కన్నెత్తి చూడలేదని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విమర్శించారు. ఆయన ఫాంహౌస్‌కు వెళ్లడానికి రోడ్డు విస్తరణ కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లను కూల్చివేసి నిలువ నీడ లేకుండా చేశారు. ఆ బాధితులు ఇండ్లు కోల్పోయి తాత్కాలికంగా గుడిసెలు, టెంట్లు వేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. బంగారు వాసాలమర్రి దేవుడెరుగు.. ఉన్న ఇండ్లను కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అక్కున చేర్చుకుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వాసాలమర్రి లో సర్వే నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తించామన్నారు. అర్హులైన 205 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం. ఇందుకు సంబంధించిన మంజూరు పత్రాలను గురువారం తానే స్వయంగా వారికి అందజేస్తను. ప్రజల అవసరాలను ,ఆశలను వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకున్నారని చెప్పడానికి వాసాలమర్రి గ్రామమే ఒక నిదర్శనం” అని అన్నారు.
క్షేత్రస్ధాయిలో పర్యటన
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి పొంగులేటి గురువారం రెండు జిల్లాల్లో క్షేత్రస్ధాయిలో పర్యటించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం, సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని విభలాపూర్ లో ఇండ్ల పనులను పరిశీలించనున్నారు.