– రైతుబంధు, రుణ మాఫీపై విమర్శలు
– కేసీఆర్ పాలనను గుర్తు చేసిన హరీష్
– ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ’రైతు క్షమాపణ సభ’
భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర, జూన్ 23 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు, రైతులకు నమ్మకద్రోహం చేశారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మండిపడ్డారు. హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే నిలదీయమన్న భట్టి విక్రమార్క మాటలను గుర్తు చేస్తూ మరి ఇప్పుడు రండి, మిమ్మల్ని నిలదీస్తాం అని సవాల్ విసిరారు.మేమిచ్చిన పంటల బోనస్ మూడుసార్లు రైతు బంధు కంటే ఎక్కువ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు.. అసలు జూపల్లికి తెలివి ఉందా అని మండిపడ్డారు. అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోయిన యాసంగి బోనస్ రూ.1200 కోట్లు, ఈ యాసంగి బోనస్ రూ. 1000 కోట్లు ఎగ్గొట్టినవ్ అని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అంతగొడితే నువ్వు బోనస్ ఇచ్చింది రూ.2500 కోట్లు.. కానీ ఎగగొట్టిన రైతు బంధు విలువ రూ.29,350 కోట్లు అని ధ్వజమెత్తారు. జూపల్లి తెలుసుకో లెక్క. చర్చ పెడదామా.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన బోనస్ రూ.3వేల కోట్లు కూడా దాటదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ. ఆయన దగ్గర మూడు శాఖలున్నాయి. విద్యాశాఖ, హోంశాఖ, మున్పిపల్ శాఖ.. ఈ మూడింటిలో కూడా అట్టర్‌ప్లాప్ అయిండని హరీశ్ రావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులుండి చేసింది గుండుసున్నా. విద్యాశాఖ మంత్రిగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు.. మున్సిపల్ శాఖ, హోంమంత్రిగా ఫెయిల్ అయిండు. కానీ ఢిల్లీకి సంచులు మోసే శాఖలో మాత్రం పాసయ్యిండంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలు, వాటిపై ఆయన ఎన్నిసార్లు మాట తప్పారో చూపే ప్రత్యేక వీడియోలను స్క్రీన్‌పై ప్లే చేస్తూ హరీష్ రావు కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా ఆగకుండా 13 లక్షల రైతు కుటుంబాలకు రూ. 73 వేల కోట్ల రైతుబంధు నిధులను సకాలంలో అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు ఏం కావాలో ముందే గుర్తించి చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఇప్పుడు ప్రజలందరి నోటా ‘మళ్లీ కేసీఆర్ రావాలి‘ అనే మాట ఒక్కటే వినిపిస్తోందన్నారు. రెండు లక్షల రైతు రుణ మాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టిందని ధ్వజమెత్తారు. భద్రాద్రి రాముడిని సాక్షిగా పెట్టి రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ దేవుడినే మోసం చేశారని, ఇక ప్రజలను మోసం చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. త్వరలోనే మధిరలో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు రైతు ఆశీర్వాద సభ అని పేరు పెట్టడం రైతాంగాన్ని అవమానించడమేనన్నారు. రైతులను మోసం చేసినందుకు ఆ సభకు ’రైతు క్షమాపణ సభ’గా నామకరణం చేసుకోవాలని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మార్కెట్‌లో యూరియా దొరకడం లేదని, యాసంగి బోనస్ రెండుసార్లు ఇవ్వాల్సి ఉన్నా అడ్రస్ లేదని విమర్శించారు. వడ్ల కొనుగోళ్లలో క్వింటాకు 5 కేజీల చొప్పున తరుగు తీస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో వడ్లకు తరుగు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తరుగు తీస్తున్నా పట్టించుకోకుండా రైస్ మిల్లర్లు, దళారుల చేతుల్లో తోలుబొమ్మగా మారారు అని ఘాటుగా విమర్శించారు. పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోవడానికి పూర్తిగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు సరే కదా ఉన్న ప్రాజెక్టులను కూడా కొట్టుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ బావులకు, బోరుబావులకు రైతుల వద్ద ’డిస్కమ్’ మీటర్లు పెట్టాలని చూస్తున్నారని, అదే గనుక జరిగితే రైతులకు రోజుకు కేవలం 6 గంటల కరెంట్ వస్తుందని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎస్సీ, ఎస్టీలకు ఒక్క కార్పొరేషన్ లోన్ కూడా ఇప్పించలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది గిరిజన పిల్లలకు సహాయం అందించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రశ్నిస్తే రూ. 2,750 కోట్లు కేటాయించామని చెప్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





