మోదీ ప్రభుత్వాన్ని కలవర పెడుతున్న దిమాగీలు..!

“మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ దేశాల పై ఆధిపత్యం చేసిన జర్మనీ,ఇటలీల పాలకులు (హిట్లర్,ముస్సోలిని) లను కూడా నిద్ర లేకుండా చేసింది మేధావుల ఆలోచనలే. ఇటాలియన్ మార్క్సిస్టు తత్వవేత్త ఆంటోనియో గ్రాంస్కి ఆనాటి ఆధిపత్యాన్ని ధిక్కరించడానికి కారణం ధిమాగి ని కలిగి ఉండటమే.ముస్సోలిని తన అధికారులకు ఇచ్చిన ఆదేశం గ్రాంస్కి మెదడు పనిచేయకుండా చేయమన్నాడు.అందుకే అతను జైలు శిక్ష అనుభవించాడు.ఆ సమయంలో అతడి మెదడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసింది.ది ప్రిజన్స్ నోట్స్ అనే పుస్తకాలు కూడా రాశాడు.అతడి ఆలోచనలే యూరప్ సమాజంలో పౌర సమాజం ప్రాధాన్యతను పెంచాయి.ఆధునిక కాలంలో ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం సన్నగిల్లడం మూలంగా పౌర సమాజంను ఆశ్రయిస్తున్నారు..”

ఎర్ర కోట బురుజుల సాక్షిగా దేశ అభివృద్ధి గురించి ప్రజలకు ఇవ్వాల్సిన సందర్భం తోసిపుచ్చి,మెదడు పనిచేసేవారు అభివృద్ధి నిరోధకులు అని తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకున్నాడు నరేంద్ర మోదీ.పన్నెండు ఏళ్ళుగా బిజేపి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోతుందన్న ప్రతి సందర్భంలో అర్బన్ నక్సల్స్, రూరల్ నక్సల్స్, దిమాగీ నక్సల్స్ పదాలు వాడుతున్నారు.విద్యార్ధి ఉద్యమంతో కలవరపడిన ప్రభుత్వం దిక్కు తోచని స్థితిలోకి నెట్టివేయబడీంది.ఈ పదాల వెనుక ఆంతర్యం దేశాన్ని ఏ స్థితిలోకి నెట్టెసిందో, అనుభవాలు మన ముందు కదిలాడుతున్నాయి.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ దేశాల పై ఆధిపత్యం చేసిన జర్మనీ,ఇటలీల పాలకులు (హిట్లర్,ముస్సోలిని) లను కూడా నిద్ర లేకుండా చేసింది మేధావుల ఆలోచనలే. ఇటాలియన్ మార్క్సిస్టు తత్వవేత్త ఆంటోనియో గ్రాంస్కి ఆనాటి ఆధిపత్యాన్ని ధిక్కరించడానికి కారణం దిమాఖ్ ని కలిగి ఉండటమే.ముస్సోలిని తన అధికారులకు ఇచ్చిన ఆదేశం గ్రాంస్కి మెదడు పనిచేయకుండా చేయమన్నాడు.అందుకే అతను జైలు శిక్ష అనుభవించాడు.ఆ సమయంలో అతడి మెదడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసింది.ది ప్రిజన్స్ నోట్స్ అనే పుస్తకాలు కూడా రాశాడు.అతడి ఆలోచనలే యూరప్ సమాజంలో పౌర సమాజం ప్రాధాన్యతను పెంచాయి.ఆధునిక కాలంలో ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం సన్నగిల్లడం మూలంగా పౌర సమాజంను ఆశ్రయిస్తున్నారు.

బ్రిటిష్ పాలనా కాలంలో కూడా యువత ప్రశ్నలు ( భగత్ సింగ్ లాంటి యువత) వారికి దిమాఖ్ లేకుండా చేసింది.ఆనాటి నుంచి మొదలు నేటి వరకు పాలకుల మెదళ్లను తొలిచింది పౌర సమాజపు ఆలోచనలే. ఆ ఆలోచనలకు,కుల మతాలు ఉండవు.ఆశ్రిత రాజకీయాలు ఉండవు.సమాజంలో నిరంతరం ప్రజలను జాగురూకత చేస్తాయి.పాలకుల స్వార్థ పూరిత రాజకీయాలను బహిర్గతం చేస్తాయి.. నిరంతరం ప్రశ్నిస్తుంటాయి. ఈ బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చరిత్ర ను చెరిపేయడం ప్రారంభించారు.మధ్య యుగ కాలం నాటి మత వ్యవస్థను పున ప్రారంభించారు.స్వాతంత్రోద్యమ చరిత్ర పై నెత్తుటి మరకలు అంటించారు.ప్రజలలో చైతన్యం తెచ్చే పాఠ్యాంశాలను పుస్తకాల నుండి తొలగించడం ప్రారంభించారు.

అనేక విశ్వవిద్యాలయాలో సంఘ్ పరివారం భావజాలం కలిగి ఉన్న వారికి ఉద్యోగవకాశాలు కల్పించారు.చివరకు పేపర్ లీకేజీ లకు కారకులయ్యారు.నోట్ల రద్దు ఈ దేశ ప్రజలను నడి బజారులో నిలబెట్టినది.ఆనాడు ఆ ప్రజలకు మద్దతు గా నిలిచిన వారి మీద దేశ ద్రోహులుగా ముద్ర వేసింది.బిజెపి తెచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకించడంతో దీని వెనుక అర్బన్ నక్సల్స్, రూరల్ నక్సల్స్ ఉన్నారని పాలకులు ప్రచారంలో కి తెచ్చారు.పేపర్ లీకేజీ విషయంలో బిజెపి ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసిన యువత ఉద్యమం వారికి కునుకు లేకుండా చేసింది.దీని వెనుక ఉన్నది దిమాగీ నక్సల్స్ అట. అడవిని,ఈ దేశ సంపదను నిరంతరం కాపాడుతున్న ఆదివాసీల ను అనేక ఆపరేషన్ ల పేరుతో ఇలాంటి మాటలు మాట్లాడుతూ అంతం చేయనరంభించారు.

ప్రశ్నించే మేధావి సమాజాన్ని అణచివేయడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న నిరుద్యోగ యువతను దేశద్రోహులుగా చిత్రీకరించడం,వారి నిరసనలకు అర్బన్ నక్సల్,రూరల్ నక్సల్,దిమాగీ నక్సల్ వంటి ముద్రలు వేయడం ప్రజాస్వామ్య వ్యవస్థ పతనానికి నాంది పలికే ప్రమాదకరమైనటువంటి రాజకీయ ధోరణి. ప్రజల రాజ్యాంగబద్ధమైన అసమ్మతిని దేశద్రోహంగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే గొంతుకలను అభివృద్ధి నిరోధక శక్తులుగా చిత్రీకరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేరు.చట్టబద్ధమైన హక్కులను వినియోగిస్తూ ప్రశ్నించే పౌరులపై ఎన్ని రాజకీయ ముద్రలు వేసినా,అవి వారి ఆలోచనా స్వాతంత్ర్యాన్ని,మేధో సామర్థ్యాన్ని,సృజనాత్మకతను చంపలేవు.ఒక తరాన్ని దేశద్రోహులుగా ముద్ర వేసి నోరు మూయించవచ్చని భావించడం చారిత్రకంగా కూడా,సామాజికంగా కూడా భ్రమే.ఎందుకంటే నిరుద్యోగ యువత ప్రశ్నల్లో వారి భవిష్యత్తు ఆందోళన ఉంది.

మేధావుల ఆలోచనలలో, ప్రశ్నల్లో, సమాజ భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యత ఉంది.పౌర సమాజపు ప్రతిఘటనలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన అంతర్లీన చైతన్యం దాగి ఉంటుంది.ఆ చైతన్యాన్ని అణచివేయడానికి ఉపయోగించే ప్రతి చట్ట విరుద్ధమైన ముద్రలు మరిన్ని ప్రశ్నలకు, మరింత బలమైన ప్రత్యామ్నాయ ఆలోచనలకు కారణమవుతుంది.మేధస్సును ముద్రలతో బంధించలేరు, సృజనాత్మకతను చట్టాల పేరుతో హత్య చేయలేరు, ప్రశ్నించే గొంతును అధికార బలంతో శాశ్వతంగా మూసివేయడం అసమంజసం.సమాజంలోని అట్టడుగు వర్గాల వారి పక్షాన, ఆదివాసుల పక్షాన,దళితుల పక్షాన,గిరిజనుల పక్షాన నిలబడుతున్న గొంతుకలను అంతమొందించినంత మాత్రాన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్న మరణించదు.మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రశ్నలు ఎవరెస్ట్ శిఖరంత ఎత్తున పుట్టుకొస్తూనే ఉంటాయి.ప్రశ్నించే సమాజం ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం బతికే ఉంటుంది. ప్రశ్నలను అణచివేయాలనే ప్రయత్నం పెరిగిన కొద్దీ ప్రజాస్వామ్య ప్రతిఘటన మరింత పదునెక్కుతూనే ఉంటుంది. ఆధిపత్యం ఉన్నంత కాలం ప్రశ్నించే భావజాలం బతికే ఉంటుందన్న విషయం పాలకులు యాది పెట్టుకోవాలి.
-పందుల సైదులు 
న్యాయవాది
తెలంగాణ విద్యావంతుల వేదిక
మొబైల్: 9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *