– కిటికీ నుంచి శిశువును బయటకు విసిరివేసిన వైనం
– యువతిని నిలోఫర్‌కు తరలించిన సిబ్బంది
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : గోల్కొండ ప్రాంతంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఓ విద్యార్థిని ప్రసవం తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లోని యువతి బాత్‌రూంలో ప్రసవించగా అనంతరం నవజాత శిశువు మృతిచెందడం ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హాస్టల్‌లో ఉంటున్న యువతి బాత్‌రూంలో ప్రసవించింది. శిశువును వెంటిలేటర్ నుంచి పడేయడంతో మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే శిశువు మృతికి గల కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. విద్యార్థిని గర్భవతి అయినప్పటికీ ఎవరూ గుర్తించలేకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. దీనిపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. యువతిని చికిత్స నిమిత్తం నిలోఫర్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు శిశువు మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఘటనతో హాస్టల్‌లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. యువతి గర్భానికి, శిశువు మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. యువతి బావ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.