ఆఫీస్ పనిమీద కలకత్తా వచ్చిన గౌతమ్ కి అక్కడి గెస్ట్ హౌస్‌లో ‘సోనూ’ పరిచయమయ్యాడు. ఎప్పుడూ నవ్వుతూ తిరిగే ఆ కుర్రాడి అసలు ఊరు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుందర్‌బన్స్ లోని మడ అడవులలో చిన్నదీవిలో. ట్రైనింగ్ సెషన్స్ అయ్యాక రోజు సోనుతో కూర్చుని కబుర్లు చెప్పేవాడు. ఆ రోజు సాయంత్రం సోనుని తీసుకుని బజారుకు వెళ్ళాలని ఆనుకున్నాడు. తీరా అతనికోసం చూస్తే గెస్ట్ హౌస్ వెనుక ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. అది చూసి సోనూ దగ్గరకు వెళ్లి భుజం తట్టి ఏమయిందని అడిగాడు. ఆ అనునయానికి అతనిలో దుఖం కట్టలు తెంచుకుంది. కాసేపటికి తెప్పరిల్లి తనకథ చెప్పడం మొదలుపెట్టాడు.
“మాది అందమైన చిన్నఊరు దాదా! అడవిలోకి వేటకి వెళ్లి పొట్టపోసుకునే వాళ్ళం ఒకరోజు నాన్న అడవికి వెళ్లినప్పుడు పులి దాడిచేసి చంపేసింది. ఆ తరువాత అమ్మ జ్వరంతో చచ్చిపోయింది. నేను అక్క మాత్రమే ఉండేవాళ్లం. ఒకరోజు మా ఊరి పెద్దమనుషులు ఇద్దరు కలకత్తా నుండి వచ్చిన ఒక ఏజెంటుని తీసుకువచ్చారు. వరకట్నం లేకుండా కలకత్తాలో పెద్దసంబంధం వచ్చిందని చెప్పారు. అక్క జీవితం బాగుపడుతుంది కదాని ఆనందంగా ఒప్పుకున్నాను. ఊరి వాళ్ళందరూ కలిసి పెళ్లిచేసి పంపించారు. వెళ్లేటప్పుడు అక్క నన్నుపట్టుకుని ఏడ్చింది. ‘వెళ్లాక ఫోన్ చేస్తా సోనూ’ అంది.
కానీ ఆ తర్వాత అక్కనుంచి ఫోన్ రాలేదు. ఊరిపెద్దలను అడిగితే, నన్ను బెదిరించారు. మూడునెలల తర్వాత పోలీసులు వస్తే గానీ అసలు నిజం తెలీలేదు. పెళ్లిపేరుతో మా ఊరి పెద్దమనుషులే డబ్బులు తీసుకుని అక్కను వాడికి అమ్మేశారు. వాడు బొంబాయిలోని చీకటి వేశ్యాగృహానికి తెగనమ్మాడు. అక్కడ నరకాన్ని భరించలేక, అక్క చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది!” అంటూ సోనూ వెక్కివెక్కి ఏడ్చాడు.
భారమెక్కిన మనసుతో గౌతమ్ నెమ్మదిగా భోలావైపు చూశాడు. “జరిగినదానికి ఎంత బాధపడినా ప్రయోజనం లేదు భోలా. నీ అక్క ఆత్మహత్యకు కారణమైన ఆ పెద్దమనుషులను మార్చడం మనవల్ల కాదు కానీ, మీ ఊరిలో మరో ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరగకుండా ఆపడం మనచేతుల్లో ఉంది. దానికి చదువే ఏకైక మార్గం” అన్నాడు.
ట్రైనింగ్ ముగిసి తిరుగు ప్రయాణమయ్యే రోజు “సోనూ! నువ్వు చదువుకోవాలనుకుంటే నావైపు నుంచి పూర్తిసహాయం చేస్తాను. కలకత్తాలోనే ఉండి చదువుకుంటానన్నా సరే, మీ ఊరెళ్లి చదువుకుంటానన్నా సరే, దానికి అయ్యే ఖర్చంతా చూసుకుంటాను. నువ్వు బాగా చదువుకుంటే, రేపు మీ ఊరివాళ్లకు ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించగలవు” భరోసా ఇస్తున్నట్లుగా చెప్పాడు గౌతమ్. ఆ మాటలు భోలాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి.
ఏడాది తర్వాత- గౌతమ్ ఫోన్ మోగింది. అవతలినుంచి సోనూ ఉత్సాహంగా మాట్లాడాడు. “దాదా! నువ్వు చెప్పినట్టు నాకు ఇప్పుడు చదువు విలువ తెలిసింది. నేను నేర్చుకున్న అక్షరదీపాలు తోడుగా ఉన్నాయి. మా ఊరికెళ్లి అక్కడ పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు చదువువిలువతో పాటు మానవమృగాల బారి పడకుండా జాగ్రత్తగా ఉండమని చెబుతాను’’ అన్నాడు. “చాలా సంతోషం సోనూ! నీ వంతు కృషి చేయడమే నీ ధ్యేయం, కర్తవ్యం” గౌతమ్ నెమ్మదిగా ఫోన్ పెట్టాడు.




