రోడ్డు పక్కన కాన్వాయ్ ఆపి బజ్జిలు తిన్న ఆర్‌ఆర్‌ఆర్
కొత్తగూడెం, ప్రజాతంత్ర, జులై 1: ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పర్యటనల సమయంలో హడావుడి మామూలుగా ఉండదు. పోలీసు ఎస్కార్టు, చుట్టూ ఉండే అభిమానులతో హడావుడి కనిపిస్తుంది. కానీ ఖమ్మం ఎంపీ రామసహాయం సింప్లిసిటీ ప్రతి ఒక్కరి మనసులను చూరగొన్నది. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ ప్రజలు ఆయన్ను ప్రశంసించకుండా వుండలేకపోతున్నారు. ఇంతకీ ఆయన సింప్లిసిటీ గురించి తెలుసుకుందాం. ఎంపీ రామ్ణసహాయం రఘురామ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలంలో వానను సైతం లెక్కచేయకుండా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం వేళ గౌండ్ల రామవరం ప్రభుత్వ పాఠశాల సమీపంలో కార్యకర్తలతో సమావేశం ముగించుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కనే ఓ పాకలో బజ్జీల కొట్టు నిర్వహిస్తున్న జయలక్ష్మి అనే మహిళ వద్ద తన కాన్వాయ్ ఆపి ఆమెతో ముచ్చటించి బజ్జీలు కొని తనతోపాటు కార్యకర్తలకు తినిపించారు. అప్పటివరకు ఎవరో చోటామోటా రాజకీయ నాయకుడు అనుకున్న ఆమె స్వయంగా తన చేత్తో చేసిన బజ్జీలు ఎంపీ తిన్నారనే విషయం తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వెంటనే తేరుకుని తాను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అభిమానినని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూండయ్యేలా చూస్తామని ఎంపి హామీ ఇవ్వడంతో జయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు.