2026 జనవరి 28 నుంచి 31వరకు
పూజారుల సంఘం ప్రకటన పట్ల మంత్రి సీతక్క హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జాతర జరగనుందని తెలిపింది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు చేరుకుంటారని, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారని పూజారుల సంఘం తెలిపింది. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుందని పూజారులు తెలిపారు. కాగా, మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించడంపట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఓ ప్రకటనలో పూజారుల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. మహా జాతర తేదీలను ప్రకటించడంతో పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రూ.110 కోట్లతో అభివృద్ది పనులు కొనసాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు.