ఆర్‌అండ్‌బి పనుల్లో వేగం పెంచాలి

సి.ఈ స్థాయి అధికారి కూడా ఫీల్డ్‌ విజిట్‌ చేయాల్సిందే
ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటా
ప్రతి రివ్యూకు పనుల పురోగతి చూపించాలి
– రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలోని అన్ని రకాల పనుల్లో వేగం పెంచాలనీ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బి శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో మంత్రి మంగళవారం సుదీర్ఘంగా సమీక్షించారు. పనుల్లో పురోగతి పెంచేందుకు ఖచ్చితంగా చీఫ్‌ ఇంజనీర్‌స్థాయి అధికారి ఫీల్డ్‌ విజిట్‌ చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. శాఖపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటానని, ప్రతి సమీక్షకు పనుల పురోగతి చూపాలని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర వాటా రూ.300 కోట్ల సీఆర్‌ఐఎఫ్‌ ఫండ్‌ వచ్చేలా కృషి చేశానని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. బిల్స్‌ క్లియర్‌ అవుతుంటే అదేస్థాయిలో పనులు కూడా వేగంగా జరగాలనీ, పనులు పూర్తి చేయించాల్సిన బాధ్యత అధికారులదే కావున క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అన్ని రకాల పనుల్లో పురోగతి చూపించాలన్నారు. హ్యామ్‌ రోడ్లు పది ప్యాకేజీలు మొదలు చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇఎన్సీ జయ భారతిని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్స్‌, వర్టికల్‌ కర్వ్స్‌ ముందే గుర్తించాలనీ సూచించారు. తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, సంగారెడ్డి, మంచాల, చౌటుప్పల్‌ రోడ్లు, చిట్యాల, భువనగిరి, హాలియా, మల్లేపల్లి రోడ్లపై మంత్రి చర్చించారు. ప్రతి మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి ఆర్‌అండ్‌బి రోడ్ల కనెక్టివిటీ పెంచేందుకు భూ సేకరణ సమస్య లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. హ్యామ్‌ రోడ్ల డిపీఆర్‌, టెండర్‌ ప్రాసెస్‌పై రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తాననీ మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆర్‌అండ్‌బి శాఖ నిధుల విడుదలపై సానుకూలంగా ఉన్నారనీ, హాస్పిటల్స్‌, రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే బాధ్యత మనపై ఉంచారనీ అధికారులకు గుర్తు చేశారు. పూర్తికావస్తున్న దశలో ఉన్న ఆర్వోబిలు, మెడికల్‌ కాలేజీలు, టిమ్స్‌ హాస్పిటల్స్‌, కలెక్టరేట్లు వెంటనే పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఇటీవల ప్రమోషన్స్‌, పోస్టింగ్స్‌ పొందిన వారు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సమీక్షలో ఇన్‌చార్జి ఈఎన్సి టి.జయభారతి, సిఈలు మోహన్‌ నాయక్‌, లక్ష్మణ్‌, రాజేశ్వర్‌ రెడ్డి, లింగారెడ్డి, ఎస్‌ఈలు, ఈఈలు, పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page