– బెంగాల్.. తొలిసారి బీజేపీ సర్కార్
– 15 ఏళ్లుగా బెంగాల్‌ను అస్తవ్యస్థం చేసిన టీఎంసీ
– ఎన్నికల ఫలితాలపె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 4 : పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ జంగల్ రాజ్‌గా మార్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డ్ధి ధ్వజమెత్తారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం రావడం చాలా గొప్ప మార్పునకు నాంది అని పేర్కొన్నారు. బెంగాల్‌లోని బొగ్గు గనుల్లో టీఎంసీ అరాచకత్వం సృష్టించిందని, బొగ్గు గనుల్లో మమతా బెనర్జీ, అక్కడి మంత్రులు అక్రమంగా బొగ్గు ఉత్పత్తి చేసి అమ్ముకుని కోట్లు దండుకున్నారని ఆరోపించారు. రాణిగంజ్ సహా వివిధ కోల్‌బెల్ట్ నియోజకవర్గాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచిందని తెలిపారు. గతంలో సీపీఎం, ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాల్‌లో పారిశ్రామిక వ్యవస్థను ధ్వంసం చేశారన్నారు. పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయేలా దుర్మార్గంగా వ్యవహరించారని, దీంతో అక్కడి యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసపోయిందని తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేయకుండా కుట్ర చేశారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గూండాలను పెంచి పోషించిందని, వారికి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు, ప్రభుత్వ పథకాల ఫలాలను అందించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్ గూండాలు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు చేశారని, హిందువులపై దాడులకు తెగబడ్డారంటూ బీజేపీ గెలుపుతో బెంగాల్ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు బెంగాల్‌లో అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో పూర్తిగా కనుమరుగైందిదని, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతోంది అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో బీజేపీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలకు, విజయం సాధించిన ఎమ్మెల్యేలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి అధికారిక నివాసంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. అనంతరం తెలంగాణ భవన్ వరకు కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీగా తరళివెళ్లారు. అనంతరం అక్కడ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కాగా, దక్షిణాదిన కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయంటూ తెలంగాణలో కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం చాలా సానుకూలంగా ఉండనుంది కిషన్‌రెడ్డి అన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారిగా 10వ తేదీన తెలంగాణకు రానున్నారని, ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆయన ఆరోపించారు.
—————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



