అన్నదాతలు ఆగమాగం

– శనగ పంట చేతికి వచ్చినా కొనుగోళ్లు ఏవీ?
– రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్
– సదాశివపేటలో శనగ రైతులకు కేటీఆర్ పరామర్శ

సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 4: కాంగ్రెస్ ప్రభుత్వం రైతును చచ్చే వరకు వేధిస్తోందని, శనగ పంట వచ్చి నెల రోజులైనా ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్   కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని పంటలు కొనుగోలు చేస్తామని వాగ్దానాలు ఏ పంట కూడా సరిగ్గా కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ ప్రారంభించలేదన్నారు. ధాన్యాన్ని దళారులపాలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ మండిపడ్డారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సీఎం, మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పుడైనా సందర్శించారా అని రైతులను ఆయన ప్రశ్నించారు. సీఎంకు భూముల కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్‌పై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడదెబ్బ, పిడుగులు, గుండెపోటు తదితర కారణాలతో రైతులు చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ రాసిన లేఖతో రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. రాబోయే వారం రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలు తిరిగి రైతులకు ధైర్యం చెబుతామని, అవసరమైతే తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని, ధాన్యం కొనుగోలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పంటలను కొనకుండా గోస పెడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్  అండగా ఉంటుందని రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఎలాంటి షరతులు లేకుండా ధానాన్ని మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. వరి, జొన్న, శనగ పంటలకు మద్దతు ధర కోసం రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ కదం తొక్కుతుందన్నారు. పార్టీ శ్రేణులంతా కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన తెలపాలని, తహశీల్దార్, ఆర్డీవోలకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.

అవినీతిని ప్రశ్నించినందుకే క్రిశాంక్ అరెస్ట్.. జైలులో పరామర్శ
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే మన్నే క్రిశాంక్‌ని అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆయనపై 35 కేసులు పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి పైశాచికానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, సోషల్ మీడియాపై పెట్టిన శ్రద్ధలో ఒక్క పైసా అయినా సీఎం శాంతిభద్రతలపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న పార్టీ నేత మన్నె క్రిశాంక్‌తో కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కేపీ వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ క్రిశాంక్ న్యాయవాది, పీహెచ్‌డీ పొందిన వ్యక్తి అని, ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఉద్యమంలో ముందుండి పోరాడారని, రెండున్నరేళ్లుగా ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా 12 రోజులుగా జైలులో పెట్టి హ్యాబిచువల్ అఫెండర్‌గా చూపడం దుర్మార్గమని మండిపడ్డారు. కరీంనగర్‌లో పగటిపూట కాల్పులు జరిగినా ప్రభుత్వం స్పందించలేదు కానీ ఎవరు ట్వీట్ చేశారు అన్న దానిపై మాత్రం అప్రమత్తంగా ఉందని ఎద్దేవా చేశారు. పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీలా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ నేతల, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ వేధింపులు వంటివి కొనసాగుతున్నాయన్నారు. తమ నాయకులను వేధించినా తాము వెనక్కి తగ్గబోమని, కాంగ్రెస్ హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల” భయపడవద్దు.. పార్టీ లీగల్ సెల్ మీకు అండగా ఉంటుంది.. న్యాయం, ధర్మం మన వైపు ఉన్నాయి అని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *