– 20 ప్రాంతాల్లో ఆధునిక సైలోలు
– ప్రస్తుత కొనుగోలు వ్యవస్థ కొనసాగుతుంది
– ఎస్‌హెచ్‌జీలు, పీఏసీఎస్‌ల పాత్ర యథాతథం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధాన వరి ఉత్పత్తి జిల్లాల్లో 20 ప్రాంతాల్లో అత్యాధునిక ఆటోమేటెడ్, వెదర్ ప్రూఫ్ ప్యాడీ స్టోరేజ్ నెట్‌వర్క్ (సైలోల) ఏర్పాటుపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం నిల్వ, రవాణా రంగానికి చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు ప్రతి ఏడాది పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిల్వ సామర్థ్యాలను కూడా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగా ప్రారంభ దశలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 50 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో సైలోల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఈ సైలోలు ప్రస్తుతం అమలులో ఉన్న ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థలకు ప్రత్యామ్నాయం కాదని, వాటికి అనుబంధంగా పనిచేసే ఆధునిక మౌలిక వసతులుగా ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో స్వయం సహాయక సంఘాలు, ఐకేపీ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో కూడా వాటి పాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుత కొనుగోలు వ్యవస్థను కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేస్తాం అని మంత్రి తెలిపారు. పంట కోతల అనంతరం ప్రకృతి వైపరీత్యాల ప్రభావం లేకుండా, నిల్వ నష్టాలను తగ్గించడం, పురుగు ప్రభావం లేకుండా ధాన్యం నాణ్యతను పరిరక్షించడం, రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, సరఫరా గొలుసును మరింత సమర్థవంతంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న సాంకేతిక నిపుణులు ఆధునిక సైలోల ద్వారా ధాన్యం స్వీకరణ నుంచి నిల్వ, రవాణా వరకు మొత్తం ప్రక్రియను ఆటోమేటెడ్ పద్ధతిలో నిర్వహించవచ్చని వివరించారు. డిజిటల్ నాణ్యత పరీక్షలు, యాంత్రిక అన్‌లోడింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ, శాస్త్రీయ నిల్వ విధానాల ద్వారా ధాన్య నాణ్యతను దీర్ఘకాలం కాపాడవచ్చని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు, నిల్వ కేంద్రాల వద్ద ఎదురవుతున్న కార్మికుల కొరత, రవాణా ఆలస్యం వంటి సమస్యలకు కూడా ఈ వ్యవస్థ సమర్థవంతమైన పరిష్కారం చూపగలదని అభిప్రాయపడ్డారు. రైల్వే అనుసంధానంతో కూడిన ఆధునిక లాజిస్టిక్స్ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశవ్యాప్తంగా వినియోగ కేంద్రాలకు వేగంగా తరలించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన వరి ఉత్పత్తి జిల్లాల్లో సైలోల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, నిల్వ సామర్థ్యాలు, పెట్టుబడి వ్యయం, అమలు విధానాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని మంత్రి సంబంధిత సంస్థలను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి రైతులకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యంగా సాంకేతికతను వినియోగిస్తూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




