– వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టింది
– కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారు
– కేబినెట్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాం
– మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం, నేడు డిజిటల్ కేబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేయడం రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నదన్నారు. ఇకపై కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడమంటే ధాన్యం కొనుగోళ్ల నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడానికి చేతకాదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నాడన్నారు. రైతుల బతుకులతో ఆడుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? కేంద్ర కోటాల పేరుతో కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడం తప్ప మరోటి కాదన్నారు. పంట బోనస్ రావాలంటే ఏడు రకాల సన్నాలే సాగు చేయాలని చెప్పడం అంటే సాగుపై ఆంక్షలు విధించడమే. పంట మార్పిడి చేయండి అన్న మీ మాటలు నమ్మి జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, శనిగలు పండించిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైంది. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేస్తే మిగతా 1.20 లక్షల క్వింటాళ్ల పంట మిగిలిపోయింది. శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చింది. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక, కనీస మద్దతు ధర రూ. 3371 ఉంటే ప్రైవేటు వ్యక్తులకు రూ.2500 కే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న విషయంలో 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధన వల్ల మక్క రైతులు దిక్కు తోచని స్థితికి వెళ్లారు. ఇప్పుడు వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం షరతులు, పరిమితులు విధిస్తే రైతుల బతుకులు ఆగం అవుతాయి. కేసీఆర్ రైతన్నను రాజుగా చేస్తే, రేవంత్ రెడ్డి దివాళా తీసే కుట్రలు చేస్తున్నాడు. రుణ మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంట బోనస్, కొనుగోళ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా ఇలా అన్నింటిలో కోతలు పెడుతూ రైతుకు తీరని ద్రోహం చేస్తున్నడు. ప్రాజెక్టుల్లో రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి ఇప్పుడు రైతులకు నీళ్లు లేవు కాబట్టి పంటలు చూసుకుని వేయండి అని చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ సమావేశానికి ముందే తెలంగాణలో నీటి కొరత ఉందని, ఏపీ ఇప్పటికే అధికంగా నీటిని తరలించిందని లేఖలు రాసినా మళ్లీ 10 టీఎంసీల నీటిని ఏపీకి ఎందుకు వదిలారు? ఒకవైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని చెబుతూ,మరోవైపు ఏపీకి నీళ్లు అప్పగించడం తెలంగాణ రైతాంగానికి చేసిన ద్రోహం కాదా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పని చేసి ఎల్ నినో పేరుతో తప్పించుకునే ప్లాన్ వేయడం సిగ్గుచేటు. సాకులు, సమస్యలు అంటూ పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే రైతాంగం నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నాం. పంటల కొనుగోళ్లపై కేబినెట్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. రైతుభరోసా విడుదల చేయడానికి బహిరంగ సభలు ఎందుకు గత యాసంగిలో రెండు సభలు పెట్టి రెండెకరాలకు వేసి చేతులు దులుపుకొని ఇప్పుడు మరోసారి బహిరంగ సభ పెట్టి రైతుభరోసా వేస్తామనడం హాస్యాస్పదం. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులతోపాటు, పెండింగ్‌లో ఉంచిన మూడు విడతల రైతు భరోసా బకాయిలు మొత్తం 16,545 కోట్లు ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





