మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ముషాయిరా
– భూముల పరిరక్షణ, స్మశానవాటికల స్థల సేకరణకు ఉత్తర్వులు
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18: మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించామని, వాటికి సంబంధించిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. సచివాలయంలో గురువారం మైనారిటీల సంక్షేమం, వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవాల) సందర్భంగా హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ సంస్కృతిని ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున ముషాయిరా (కవి సమ్మేళనాలు) నిర్వహించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఆధునిక హంగులు, వసతులతో నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రస్తుతం 20 రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, మరో 17 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. భట్టి  స్పందిస్తూ అసంపూర్తి పాఠశాల భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మైనారిటీ యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. మైనార్టీ సంస్థల విలువైన వక్ఫ్, ఇతర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే మైనారిటీల స్మశానవాటికల చుట్టూ ప్రహరీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో స్మశాన వాటికల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సేకరించి కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరగబోయే మొహర్రం వేడుకల సందర్భంగా 9వ రోజున నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ కోరగా ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా హాజరవుతానని అన్నారు. సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రటరీ సిక్తా పట్నాయక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, మైనారిటీఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్,  మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ ఫహీమ్ ఖురేషీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాను, మైనార్టీ వెల్ఫేర్ సెక్రెటరీ షఫీ ఉల్లా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *