– రాష్ట్రంలో దశల వారీగా భూముల రీసర్వే
~ వచ్చే నెల నుంచి తొలి దశలో 2240 గ్రామాల్లో ప్రారంభం
~ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ అధికారులతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున మొత్తం 2240 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూమి రైతుకు ఆస్తి మాత్రమే కాదని, అది అతని జీవనాధారమని, ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్‌కు భూదార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ రీ-సర్వే కార్యక్రమం చరిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో 1936 నాటి నిజాం కాలపు సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్నాయని, కాలక్రమేణా భూముల విభజనలు, ఉప సంఖ్యలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దులు మారడం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల అసలు హద్దులపై స్పష్టత లేకుండా పోయిందని చెప్పారు. ఈ పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం సమగ్ర రీ-సర్వే చేపడుతోందని తెలిపారు. నిజాం కాలం నుంచి నక్షాలు లేని 378 గ్రామాలను గుర్తించామని, వాటిలో ఇప్పటికే ఐదు గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి భూదార్ నంబర్లు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 373 గ్రామాల్లో కూడా రోవర్స్ వంటి ఆధునిక సాంకేతికతతో సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు పూర్తిగా స్వస్తి చెబుతున్నామని మంత్రి తెలిపారు. డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శాస్త్రీయ పద్ధతిలో భూముల సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 411 రోవర్స్ కొనుగోలు చేయగా, త్వరలో మరో 400 రోవర్స్ కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రతి సర్వే నంబర్‌కు భూదార్
భూముల రీ-సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి ఖచ్చితమైన హద్దులను నిర్ణయించి, ప్రతి సర్వే నంబరుకు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆధార్ తరహాలో ప్రతి భూమికీ ప్రత్యేక గుర్తింపుగా భూదార్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. డీజీపీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా ప్రస్తుతం అవి 2.29 కోట్లకు పెరిగాయని, రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూదార్ నంబర్లు కేటాయించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. రీ-సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన మానవ వనరులను ప్రభుత్వం సమకూర్చిందని, 5,520 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేశామని, భూవిస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి 4 నుంచి ఆరుగురు సర్వేయర్లను నియమించినట్లు వివరించారు. రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భూ భారతి చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేసిన నేపథ్యంలో రీ-సర్వే ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారనున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




