– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
– గాంధీ భవన్‌లో రాహుల్ జన్మదిన వేడుకలు, సీతక్క రక్తదానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని గాంధీ భవన్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క రక్తదానం చేసి యువతకు, పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు. కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ మంత్రి సీతక్కకు రక్తదాన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వైద్యులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాక మానవీయ విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు. దేశంలో సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, పేదలు, రైతులు, యువత, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు అని కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ అని, ఆయన రాజకీయాల్లో సేవాభావం, నిబద్ధత, నిజాయతీకి ప్రతిరూపమని అన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో నాయకుల జన్మదినాలను జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమని పేర్కొన్నారు. రక్తదానం మహాదానం అని, ఒక యూనిట్ రక్తం అనేకమంది ప్రాణాలను కాపాడగలదని మంత్రి సీతక్క అన్నారు. యువత, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




