ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు

-హైకోర్టు సంచలన తీర్పు
– రాజకీయాల్లో కీలక పరిణామం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు సీజే ఆధ్వ‌ర్యంలోని ధర్మాసనం  కీలక తీర్పు వెలువరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దానం పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదంటూ స్పీకర్ ట్రైబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. 10వ షెడ్యూల్ ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. అలాగే, పార్టీ ఫిరాయింపులపైనా స్పీకర్‌కు పలు ఆధారాలు సమర్పించామని, వాటిని పరిగణలోనికి తీసుకోకుండా సరైన ఆధారాలు లేవని స్పీకర్ ట్రైబ్యునల్ మార్చి 11న ఉత్తర్వులు జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఈసీకి సమాచారం ఇచ్చింది.

స్టే విధించాలన్న వినతి తిరస్కరణ

హైకోర్టు తీర్పు అనంతరం తీర్పు అమలుపై స్టే విధించాలని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు గడువు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేను ఇప్పటికిప్పుడు పదవి నుంచి తొలగిస్తే నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

తీర్పును స్వాగతించిన బీజేపీ

దానం నాగేందర్ అనర్హత కేసులో హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం త‌మ పార్టీ పోరాటం చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు. ఒక పార్టీ తరఫున గెలిచి అనంతరం మరో పార్టీలో కొనసాగుతున్న నాగేందర్ వ్యవహారంపై బీజేపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకమైన పరిణామమని, ఈ తీర్పు ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించింది. బీజేపీఎల్పీ నేతగా తాను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందని తెలిపారు. సంబంధిత ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండా తీర్పును గౌరవించి వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. ఈ వ్యవహారంలో ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా ఉండేందుకు బీజేపీ తరఫున రేపటిలోగా కేవియట్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు గౌరవం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి ప్రజల తీర్పును స్వీకరించాలని బీజేపీ డిమాండ్ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *