– కాంగ్రెస్, బీర్ఎస్‌లు భూములను దోచుకుంటున్నాయి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఫైర్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చూస్తుంటే ఆ రెండు పార్టీల అసలు నైజం ఏమిటో ప్రజలు స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. దిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ పదేపదే నిజాంను మంచి పరిపాలకుడని, గొప్ప పనులు చేశాడని కీర్తిస్తే మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సైతం నిజాం చాలా గొప్ప మనిషంటూ పొగడ్తలతో ముంచెత్తడం ఈ రెండు పార్టీల వక్ర వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. నాడు నిజాం పాలనలో పల్లెల్లో కనీసం ఆడబిడ్డలు బతుకమ్మను కూడా ఆడుకోలేని పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. జలియన్ వాలాబాగ్ తరహాలో పరకాల, జోడేఘాట్, గుండ్రాంపల్లి, వెయ్యి ఊడల మర్రి (నిర్మల్) వంటి అనేక ప్రాంతాల్లో ప్రజలను విచక్షణా రహితంగా కాల్చి చంపిన రక్త చరిత్ర నిజాం సర్కారుదని అన్నారు. అలాంటి క్రూరమైన నిజాంను నేడు ప్రజాస్వామ్య పాలనలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదని మండిపడ్డారు. నాటి నిజాం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉండేవాడని, ఆయన తరహాలోనే తాము కూడా దేశంలోనే అత్యంత ధనికులుగా మారాలన్న దురాశతోనే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ప్రజాధనాన్ని, భూములను విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నిజాం సొమ్మును, పేదల భూములను దోచుకున్నారని, దాదాపు 500 ఎకరాల విలువైన భూములను కొల్లగొట్టారని స్వయంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డే వెల్లడించారని రామచందర్ రావు ప్రస్తావించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు సైతం 22-ఏ (నిషేధిత జాబితా) ముసుగులో ప్రైవేటు భూములను కబ్జా చేస్తూ భారీ భూకుంభకోణాలకు పాల్పడుతున్నారనేది బహిరంగ వాస్తవమని ఆరోపించారు. ఒకరు నిజాం భూములను, పేదల ఆస్తులను కాజేశారని మరొకరు చెబుతుంటే ఇంకొకరు 22-ఏ నిబంధనలను అడ్డం పెట్టుకుని వేల కోట్ల విలువైన భూములను ఆక్రమిస్తున్నారని పరస్పరం బట్టబయలు చేసుకుంటున్నారన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాజకీయాల్లోకి రాకముందు వారి ఆస్తులు, కుటుంబ ఆస్తులు ఎంత.. నేడు వారి ఆస్తుల విలువ ఎంత అనేది ఎన్నికల అఫిడవిట్ల ద్వారా ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఈ భూదోపిడీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. ఈ విచారణ కేవలం కేసీఆర్ హయాంలో జరిగిన 500 ఎకరాల కుంభకోణానికే పరిమితం కాకుండా కాంగ్రెస్ పాలనలో 22-ఏ నిషేధిత జాబితా పేరుతో సాగుతున్న భూకబ్జాలపై కూడా నిష్పక్షపాతంగా జరగాలన్నారు. వారి కుటుంబాలు, వ్యక్తిగత సంక్షేమం కోసమే తప్ప ప్రజల బాగోగుల గురించి ఏనాడూ ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎవరితోనూ పొత్తులు ఉండబోవని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రస్తుత పాలకులు ఈ భూకుంభకోణాలపై నిజాయతీగా విచారణ జరపకపోతే రేపు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత, ప్రస్తుత ప్రభుత్వాల భూదోపిడీలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను చట్టం ముందు నిలబెడతామని రామచందర్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





