– విద్యార్థులకు సమగ్ర బోధన జరగాలి
– 8 నుండే ‘నీట్’, పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలి
– పూలే గురుకుల పాఠశాలల ఫలితాలపై మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండాలని, ఎంజేపీ బ్రాండింగ్ దిశగా అధ్యాపక బృందం పనిచేయాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సమీక్షనిర్వహించారు. విద్యార్థులకు చదువుతోపాటు 8వ తరగతి నుండే ‘నీట్’, ఎంసెట్, పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్, ఏఐ, తదితర అంశాలపై ఉన్నత స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. గురుకులాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని, వాటిల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వం మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వం మీద, అధ్యాపకుల విశ్వాసంతో తమ పిల్లలను గురుకులాలకు పంపిస్తున్నారని, విద్యార్థులను తమ సొంత పిల్లల మాదిరి చూసుకోవాలని అధ్యాపకులకు సూచించారు. అద్దె భవనాల్లో ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు లేకపోతే కల్పించుకునే బాధ్యత ప్రిన్సిపాల్స్దేనన్నారు. ఎంజేపీ గురుకులాలు అద్భుతంగా ఉండాలంటే అందరూ సమష్టిగా ఒక కుటుంబంలాగా పనిచేయాలన్నారు. చిన్నచిన్న కారణాలతో గురుకులాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల వారు కూడా మన విద్యా విధానాన్ని అధ్యయనం చేసేలా సమర్థవంతంగా పనిచేయాలన్నారు. పదవ తరగతిలో 98.45 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల సెక్రెటరీ సైదులుతోపాటు ప్రిన్సిపాల్స్‌ను అభినందించారు. 500పైన మార్కులు 9788మంది విద్యార్థులకు వచ్చాయనీ, 204 ఎంజేపీ గురుకులాలు 100 శాతం ఫలితాలు సాధించాయని సంతోషం వ్యక్తం చేశారు. 65 స్కూల్స్ వెనుకబడి ఉన్నాయంటూ ఆ పాఠశాలల అధ్యాపకులు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ హెచ్చరించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తెలుగులో ఎక్కువగా ఉన్నారనీ, తెలుగులో ఫెయిల్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి స్కూల్లో ర్యాంకర్ల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలనీ, గ్రామాల్లో గురుకులాల్లో వచ్చిన మార్కులు ఫలితాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 90.31 శాతం, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 97.72 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 85.80 శాతం, ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 95.81 శాతం పాస్ శాతం ఉందని 900పైన మార్కులు సాధించిన విద్యార్థులు 4183 మంది, 980 మార్కులపైన 496మంది విద్యార్థులు సాధించారన్నారు. 35 విద్యా సంస్థలు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయనీ అభినందించారు. ప్రథమ సంవత్సరంలో 8 విద్యా సంస్థలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. ఎంజేపీలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు నేరుగా ఇంటర్ తరగతులకు అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్లో వచ్చిన ఫలితాల మాదిరి టీజీఎప్‌సెట్‌లో ర్యాంకులు రావాలన్నారు. ప్రతి గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాల మాయాదేవి, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల సెక్రటరీ సైదులు, ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్ హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





