- కాంగ్రెస్ డిజైన్ అమలు చేసుంటే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవి
- అంచనా వ్యయం మూడింతలు పెంచారు
- వారు కట్టిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలింది
- ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు
- ఆకాశంలో విహరిస్తూ అహంకారంతో వ్యవహరించారు
- రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, మే 24: కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ లో భాగంగ తుమ్మడి హట్టి వద్ద నిర్మాణాలు చేపట్టి ఉంటే రాష్ట్రంలో నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. కేవలం కాంగ్రెస్ కు పేరు వస్తుందన్న దుర్బుద్ధితోటే అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ పాలకులు తుమ్మడి హట్టిని పక్కన పెట్టి మెడిగడ్డ కు మార్చారని ఆరోపించారు. శనివారం హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పై సమీక్షా సమావేశాలు నిర్వహించిన అనంతరం పట్టణంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ. 38 వేల కోట్ల అంచానతో డిజైన్ చేయబడిన తుమ్మడిహట్టిని పూర్తి చేస్తే కమిషన్లు రావన్న కక్కుర్తి తోటే మరో మూడు బ్యారేజ్ ల నిర్మణాలకు పూనుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు జేశారని మండిపడ్డారు. ముందుగా వేసుకున్న అంచనాలను మూడింతలకు పెంచి అంటే 38 వేల కోట్ల నుండి ఒక్కసారిగా లక్షా 20 వేల కోట్లకు పెంచి కాళేశ్వరం పేరుతో నిర్మించిన ప్రాజెక్ట్ వారి ప్రభుత్వ హయాంలోనే కూలిపోవడాన్ని మించి మరో ఉదాహరణ అక్కర లేదని ఆయన ఎద్దేవా చేశారు. అదే రూ.38 వేల కోట్లతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తల పెట్టిన తుమ్మడిహట్టిని పూర్తి చేసి ఉంటే మిగిలిన రూ.62 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి, కోయిలసాగర్, భీమా, నెట్టేంపాడు, కల్వకుర్తి, ఎస్.ఎల్.బి.సి, డిండి,ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామా,దేవాదుల, గౌరెల్లి ప్రాజెక్టులు పూర్తి అయి యావత్ తెలంగాణా రాష్ట్రం సస్యశ్యామలంగా ఫరీడవిల్లి ఉండదన్నారు
బి.ఆర్.ఎస్ పాలకులు కాళేశ్వరం పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని దుయ్యబట్టారు.అహంకారం, అసమర్థత,అవగాహనా రాహిత్యంతో నీటిపారుదల రంగాన్ని బ్రష్టు పట్టించిన ఘనత ముమ్మాటికి బి.ఆర్.ఎస్ పాలకులకు దక్కుతుందన్నారు. ఎన్.డి.ఎస్.ఎ నివేదిక వెలుగు చూడంగానే భుజాలు దులుపుకుంటున్న బి.ఆర్.ఎస్ నేతలు అప్పుడు బాంబులు పడ్డాయేమోనని బొంకుతుండడం హాస్యాస్పదంగా వుందన్నారు. వారు చెప్పిన రీతిలో బాంబులు పడింది నిజమే అయినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నది వారేగా చర్యలు ఎందుకు తీసుకోలేక పొయారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయి 16 నెలలు గడిచాక బాంబులు పేలాయన్నది ఇప్పుడు బి.ఆర్ ఎస్ నేతలకు గుర్తుకు వచ్చిందా అని ఎద్దేవాచేశారు. వాస్తవానికి ఆ మూడు బ్యారేజ్ ల నిర్మాణాలు లోప భూఇష్టంగా మారాయని ఏజెన్సీలు, ఇంజి నీర్లు,నిర్మాణదారులు అరచి గీ పెట్టుకున్నాకమిషన్ లకు కక్కుర్తి పడిన బి.ఆర్.ఎస్ పాలకులు పెడచెవిన పెట్టిన ఫలితమే కాళేశ్వరం ఉదంతమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన రాజీవ్ సాగర్ ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా,డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ చేవెళ్ల-ప్రాణహిత సుజల స్రవంతి పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసి పాత పేర్లను తొలగించడంలో అర్డం ఏమిటని ఆయన నిలదీశారు. కాళేశ్వరం ఉదంతం పై జస్టిస్ ఘోష్ కమిటీ నిష్పక్షపాతంగా ,పార దర్శకంగా విచారణ జరుపుతోందన్నారు. తుది నివేదికను అనుసరించి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ననుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఎన్.డి.ఎస్.ఏ పై అవాకులు చవాకులు పేలదాన్ని ఆయన ఆక్షేపించారు.అత్యున్నత ప్రమాణాలతో రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన సంస్థ ఎన్.డి.స్.ఏ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగంలో భారీ సంస్కరణలకు అంకురార్పణ చుట్టమన్నారు. ఏక కాలంలో 1100 ఇంజినీర్ల నియామకాలతో పాటు 1800 లష్కర్ల నియమకాలు ఇందులో భాగమే నన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నిరందించాలన్న సంకల్పబలంతో కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ రూపొందించికుని అమలు పరుస్తున్నామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు భూసేకరణకు అవసరమైన నిధుల విడుదలకు ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు. తాజాగా నీటిపారుదల కేంద్ర కార్యాలయం జల సౌధ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశం అందులో భాగమే నన్నారు. నీటిపారుదల రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలకు అటు వానాకాలం ఇటు ఎండా కాలంలో పండిన వరి ధాన్యం అద్దం పడుతోందన్నారు పైగా ముందెన్నడూ లేని రీతిలో సన్నాలకు బోనస్ అందించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంతో మొదలు కావడం చారిత్రత్మక ఘట్టంగా నిలిచి పోతుందన్నారు. ఆకాశంలో విహరిస్తూ ఇంజినీరింగ్ నిపుణులు చెప్పేది పక్కన పెట్టి అహంకార పూరితంగా నాటి పాలకులు ఇచ్చిన ఆదేశాలు అమలు పరిచినందుకే కాళేశ్వరం కుప్ప కూలి పోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.