ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌కడ్బందీగా అమ‌లు చేయాలి : మంత్రి సీత‌క్క

మ‌న ఊరు మ‌న ఎమ్మెల్యే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను పక్కాగా అమలు చేయాల‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakka) అధికారుల‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి కలెక్టర్లు క్ర‌మంత‌ప్ప‌కుండా పర్యవేక్షించాల‌న్నారు. ఆయా పథకాలు పక్కాగా అమలు అయ్యేలా చూసే బాధ్యత కలెక్టర్ లదే అని అన్నారు. ఈసంద్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి సంక్రాంతి నుంచి తలపెట్టిన ‘మన ఊరు – మన ఎమ్మెల్యే’ పోస్ట‌ర్ ను మంత్రి సీతక్క శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనర్హులకు అందకుండా, అర్హులు మిస్ కాకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాల‌న్నారు.

గత నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డులు బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేయలేదని, కేంద్రం కూడా రేషన్ కోటాను పెంచలేదని ఆరోపించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఆయా పథకాలకి ఇబ్బందులు ఎదురవుతున్నా.. త‌మ‌ ప్రభుత్వం భారంగా కాకుండా.. బాధ్యతగా భావిస్తోంద‌న్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం, రైతు భరోసా కోసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం అర్హుల గుర్తింపును వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎక్కడా లీకేజీలు లేకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.. అందుకు అనుగుణంగా కలెక్టర్లు జిల్లాల్లో పెద్దన్న పాత్ర పోషించి ప్రజా ప్రభుత్వ లక్ష్యమైన సంక్షేమాన్ని ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాల‌న్నారు.
పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాల‌ని, లోటుపాట్ల గుర్తింపునకు పంచాయతీ రాజ్ శాఖ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాల‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *