– ప్రజలను తిప్పించుకుంటే సహించేది లేదు
– మంత్రి పొంగులేటి హెచ్చరిక
హైదరాబాద్/ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ల పనితీరులో స్పష్టమైన మార్పు రావాలని, భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకునే విధానాన్ని ఎంతమాత్రం సహించేది లేదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, గృహ నిర్మాణ శాఖల అధికారులతో ఆయన శనివారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూములకు సంబంధించిన ప్రతి దరఖాస్తును సానుకూల దృక్పథంతో నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పనిచేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు తహసీల్దార్ లాగిన్ లో 45 దరఖాస్తులు ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, దీనిపై సదరు అధికారిని వివరణ కోరాలని ఆదేశించారు.
రీ-సర్వేలోనూ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత చేపట్టిన రీ-సర్వేకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్‌లో రెండో విడత రీ-సర్వే చేపట్టేందుకు ఇప్పటి నుంచే అధికారులు సిద్ధం కావాలని సూచించారు. తొలి విడతలో రీ-సర్వే చేపడుతున్న 70 గ్రామాల్లో సర్వేను పారదర్శకంగా నిర్వహించి గ్రామ సరిహద్దులను పక్కాగా నిర్ధారించాలని ఆదేశించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో రీ-సర్వేను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, ఆర్డీవోలు, తహసీల్దార్లు కూడా గ్రామసభలకు హాజరై పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. సర్వే నిర్వహించిన రోజే భూ రికార్డులను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని, సర్వేయర్ల కొరత ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే పక్క మండలాల నుంచి సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని పొంగులేటి అన్నారు. విధులకు సరిగా హాజరుకాని లైసెన్స్ డ్ సర్వేయర్ల లైసెన్సులను రద్దు చేయాలని సూచించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో రీ-సర్వేను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
రూ. 230కే సిమెంట్ బస్తా
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సంక్షేమం కోసం రూ. 230కే సిమెంట్ బస్తా అందించేలా ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం చేసుకుందని మంత్రి వెల్లడించారు. తొలి విడత అసంపూర్తి ఇళ్లను దసరాలోపు పూర్తి చేయాలని, ఎల్-3 సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. నల్గొండ పట్టణంలో ‘ఇందిరమ్మ టవర్స్’ కింద 500 గృహాల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో వివిధ దశల్లో నిలిచిపోయిన నిర్మాణాలను గుర్తించి 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇళ్లకు సమీపంలో ఎక్కడ ఇసుక లభిస్తే అక్కడి నుంచి అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంటి పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి
గతంలో ఇంటి పట్టాల కోసం భూములను గుర్తించినప్పటికీ ఇంకా పంపిణీ చేయని వాటిని వెంటనే గుర్తించి జాబితా రూపొందించాలని, అర్హులైన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన సమస్యలను కూడా చట్టానికి లోబడి శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





