బీసీల‌పై క‌క్ష క‌ట్టిన బీజేపీ ప్ర‌భుత్వం

– 42శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల్సిందే
– బీసీ బిల్లు కోర్టుల చుట్టూ తిరుగుతోంది
– మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : బీజేపీ ప్రభుత్వం బీసీలపై కక్ష కట్టిందని ఎక్సైజ్‌, ప‌ర్యాట‌క శాఖ‌ల మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అవసరమైతే రాజ్యాంగానికి సవరణలు, సర్దుబాట్లు చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ బంద్‌లో భాగంగా ఆమనగల్ బస్టాండ్ సమీపంలో బీసీ  ఐక్య సంఘాల నాయకులు చేస్తున్న దీక్షల వద్దకు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేరుకున్నారు. వారికి సంఘీభావం తెలిపి అనంతరం జూపల్లి మాట్లాడుతూ  తరతరాలుగా వెనుకబడ్డ బీసీల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీలందరినీ కులగణన చేయించి వారి లెక్క గట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి గవర్నర్ కు పంపామ‌న్నారు. అక్కడినుండి రాష్ట్రపతి భవన్ కు కూడా బీసీ బిల్లు ఫైల్ వెళ్లినా ఎందుకు పెండింగ్‌లో ఉందో చెప్పాలన్నారు. ప్రస్తుతం బీసీ బిల్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్న‌ద‌న్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని కోరుతూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశామ‌ని మంత్రి చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేత‌ల‌ని, బీసీ ప్రజలకు రావాల్సిన హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని మార్పు చేర్పులు చేసి బీసీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అంతకుముందు దీక్షలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ప్రసంగించారు. పట్టణంలో బీసీ బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక నాయకులు చుక్క అల్లాజిగౌడ, శివలింగం, గుర్రం కేశవులు, ఆయిళ్ల  శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, తల్లోజు రామకృష్ణ, జగన్, లక్ష్మణ్ శ్రీనివాస్, ప్రసాద్, వి సాయిలు, జె.నరసింహ, ఖాదర్, అనిత, సిపిఎం నాయకులు వెంకటయ్య, శివకుమార్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page