కుటుంబ బంధాల బ‌లోపేతానికి ‘మీ సుర‌క్ష‌’

– సీడీఈడ‌బ్ల్యు, ఎఫ్‌సీసీల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హ‌ణ‌
– కుటుంబ వివాదాల ప‌రిష్కారం ల‌క్ష్యం
– కౌన్సెలింగ్ సెంట‌ర్ల జోక్యంతో ఒక్క‌టైన 150 జంట‌లు
– ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ ఆనంద్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: మహిళల భద్రత, కుటుంబ సంక్షేమం, వైవాహిక బంధాల పరిరక్షణ లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడ‌బ్ల్యు) – ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్స్ (ఎఫ్‌సీసీ) ఆధ్వర్యంలో ‘మీ సురక్ష – కలసి ఉంటే కలదు సుఖం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సామరస్యాన్ని పెంపొందించడం, వైవాహిక బంధాలను బలోపేతం చేయడం, మహిళల భద్రతపై అవగాహన కల్పించడం, కుటుంబ వివాదాలను కౌన్సెలింగ్  మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని సీడీఈడ‌బ్ల్యు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ల జోక్యంతో తిరిగి కలిసిన 150కి పైగా దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డీజీపీ  సి.వి.ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీస్ శాఖ అమలు చేస్తున్న మహిళా భద్రత కార్యక్రమాలను వివరించారు. మహిళలు, పిల్లల భద్రత, గౌరవం, సాధికారత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతలలో ఒకటని పేర్కొన్నారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, షీ షటిల్స్, సీడీఈడ‌బ్ల్యు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు వంటి కార్యక్రమాలు మహిళల భద్రతను మరింత బలోపేతం చేశాయని తెలిపారు. మీ సురక్ష–కలసి ఉంటే కలదు సుఖం కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, కౌన్సెలింగ్, మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబాలను తిరిగి కలపడంలో మహిళా భద్రత విభాగం, మల్కాజిగిరి కమిషనరేట్ చేస్తున్న కృషిని అభినందించారు. సమాజంలో భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం కుటుంబ జీవితానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళా భద్రతా విభాగం డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ కుటుంబ సంబంధాల బలోపేతానికి భార్య భర్తలు ఇద్దరూ ఓపికతో, విశ్వాసంతో పాటు ఇద్దరి మధ్య అవగాహన అవసరమని చెప్పారు. భరోసా కేంద్రాలు, సీడీఈడ‌బ్ల్యు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు కుటుంబ వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ హెడ్ ఎస్.ఎన్.శ్రీదేవి మాట్లాడుతూ వివాహం పరస్పర గౌరవం, అవగాహన, ఆధారపడిన సామాజిక వ్యవస్థ అని చెప్పారు. కుటుంబ వివాదాల పరిష్కారంలో కౌన్సెలింగ్, కీలకమన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి మాట్లాడుతూ, సీడీఈడ‌బ్ల్యు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు కుటుంబ వివాదాల పరిష్కారం, మహిళా సాధికారత, కుటుంబ సంక్షేమానికి సమర్థ వేదికగా మారాయని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎనిమిది ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని, ఇప్పటివరకు 9,700కు పైగా కేసులను పరిష్కరించడంతోపాటు 32,000కు పైగా కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే సీడీఈడ‌బ్ల్యులు, మహిళా పోలీస్ స్టేషన్లు కలిసి 377 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 16 వేల మందికి పైగా ప్రజలకు చేరువయ్యాయని, సీడీఈడ‌బ్ల్యు సేవలపై 90 శాతానికి పైగా సంతృప్తి వ్యక్తమైందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా తిరిగి కలిసిన దంపతులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కుటుంబ కౌన్సెలింగ్, వివాదాల పరిష్కారం, పునరావాసం, కుటుంబ సంక్షేమంలో విశేష సేవలందించిన ఉత్తమ సీడీఈడ‌బ్ల్యుకేంద్రాలు, కౌన్సిలర్లు, సిబ్బందిని సత్కరించారు. తిరిగి కలిసిన దంపతులు తమ అనుభవాలను పంచుకుంటూ, తమ కుటుంబాలను నిలబెట్టడంలో సహకరించిన కౌన్సెలర్లు, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మై ఛాయిస్ ఫౌండేషన్ ప్రతినిధి పెర్ల్ చోరగుడి, మహిళా భద్రత డీసీపీ టి.ఉషారాణి, సీనియర్ పోలీస్ అధికారులు, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, షీ టీమ్స్, భరోసా కేంద్రాల ప్రతినిధులు, సీడీఈడ‌బ్ల్యు  కౌన్సెలర్లు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, తిరిగి కలిసిన దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *