సీజేపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న స‌క్సెస్‌

– న్యూదిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌
-పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న అనుయాయులు
– శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌
– గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేసిన పోలీసులు
– నిర‌స‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించిన అభిజీత్ దిప్కే

న్యూదిల్లీ, జూన్‌6: దిల్లీ జంతర్ మంతర్ వద్ద జెన్ జెడ్ గ్రూప్ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం  నిర్వహించిన నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. దేశంలో ఇటీవల జరిగిన నీట్‌ పేపర్ లీక్, సీబీఎస్ఈ క్లాస్ 12 ఎగ్జామ్స్ గందరగోళం, సీయూఈటీ పరీక్షలలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. దేశ విద్యా వ్యవస్థ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఆందోళనలోకి నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఈ జెన్‌జెడ్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. అమెరికా (బోస్టన్) నుండి శనివారం ఉదయమే దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేని దిల్లీ పోలీసులు ఎయిర్‌పోర్ట్ లోపలే కలిశారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరసన తెలిపేందుకు అవసరమైన అధికారిక పర్మిషన్ పత్రాన్ని ఆయనకు అందజేశారు. భారీగా తరలివచ్చిన యువత సోషల్ మీడియా (ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్) ద్వారా ఉద్యమానికి కోట్లాదిమంది ఫాలోవర్స్ రావడంతో విద్యార్థులు, యువత, కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు, తల్లిదండ్రులు భారీగా జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. చేతిలో రాజ్యాంగ ప్రతి, జాతీయ జెండాలను పట్టుకుని నిరసనలో పాల్గొన్నారు.

లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పూర్తి మద్దతు ప్రకటించారు. విద్యా వ్యవస్థను సంస్కరించాలంటూ వీరు కూడా యువతతో చేతులు కలిపారు.ఈ జెన్‌జెడ్‌ మూవ్‌మెంట్ హింసకు తావులేకుండా చాలా వినూత్నంగా సాగింది. నిరసనకారుల కోసం సీజేపీ కొన్ని ఆసక్తికరమైన నిబంధ‌న‌లు అమ‌లు చేసింది.  ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పడకూడదు.డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి థాంక్స్ చెబుతూ పూలు అందించాలి. నిరసన స్థలానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక పుస్తకం మరియు సన్‌స్క్రీన్ లోషన్ వెంట తెచ్చుకోవాలని డిజిటల్ ప్రచారం చేశారు. ఈ నిరసన దృష్ట్యా దిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దిల్లీలోని వీఐపీల నివాసాల వద్ద (పీఎం, హోంమంత్రి ఇళ్ల వద్ద) భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను 12 జోన్లుగా విభజించి, సుమారు 2,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని, 20 కంపెనీల అదనపు బలగాలను మోహరించారు. డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షించారు. ఒక నెల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం ఒక ‘మీమ్/శాటిరిికల్ (హాస్యాస్పద)’ పేజీగా ప్రారంభమైన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’, ఇప్పుడు దిల్లీ వీధుల్లో విద్యా వ్యవస్థ మార్పు కోసం ఇంత పెద్ద ఎత్తున ప్రత్యక్ష నిరసనగా మారడం గమనార్హం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *