– తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టే కుట్ర
– సాగునీటి సలహాదారుగా ఆంధ్రాప్రాంత వ్యక్తి
– మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 6: కాంగ్రెస్ పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్‌నగర్ కు జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆంధ్రా వ్యక్తిని సాగునీటి సలహాదారుగా పెట్టి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏపీకి నీళ్లు తీసుకుపోయి పాలమూరును ఎండబెడతారంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెండర్లు పిలిచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. నిన్న మంత్రి, ముఖ్యమంత్రి మాటలకు ప్రజల నుంచి స్పందన లేదని తెలిపారు. ఇప్పటికైనా చిల్లర మాటలను సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. మహబూబ్‌నగర్‌లో శనివారం ఉదయం మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం పర్యటన గురించి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఆశతో ఎదురు చూశారని తెలిపారు. కానీ సీఎం ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కట్టిన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను పరిశీలించిన వెళ్లారని తెలిపారు. కర్ణాటక జల దోపిడీకి మనం నిధులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టును సీఎం ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు. ఇప్పటికే జూరాలకు చుక్కనీరు వస్తలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను పడావు పెడుతున్నదని విమర్శించారు. కర్ణాటకలో చర్చలు కొలిక్కి రాకుండానే బ్యారేజి కమ్ బరాజ్‌లపై ఎలా ఏరియల్ సర్వే చేశారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్‌వోసీ ఇస్తే బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తానని అంటున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మీరు తిరిగే రిజర్వాయర్‌లు కట్టింది కేసీఆర్ కాదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి త్టటెడు మట్టిని కూడా రేవంత్ ప్రభుత్వం తీయలేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేసింది 45 కి.మీ కాలువలు అని.. అందులో41 కి.మీ కాలువలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. మొత్తం రూ.33,500కోట్ల పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను కాంగ్రెస్ చేసిందని చెప్పుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి పనుల జాప్యానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంటుందని అన్నారు.
రెండున్నరేళ్లుగా తట్టెడు మట్టి తీయలేదు : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టటెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. ఇప్పుడు పూర్తి చేస్తామని అంటే ఎలా నమ్ముతారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పాలమూరు-రంగారెడ్డిపై కాంగ్రెస్ సర్కార్‌కు ప్రేమ పుట్టిందన్నారు. రెండున్నరేళ్లపాటు పాలమూరు-రంగారెడ్డిని పడావు పెట్టిందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. 10 శాతం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏడాది సమయం కావాలని అంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తి కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ను కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని లక్ష్మారెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఉత్తమ్ మాటలు అన్ని ఉత్తవే అని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మాటలపై నమ్మకం లేదని లక్ష్మారెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.