– రూ.360 కోట్లతో శాశ్వత భవనాలు
– 10 ఆర్డీవో, 107 తహసిల్దార్, 53 సబ్ రిజిస్ట్రార్ భవనాల నిర్మాణం
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : రాష్ట్రంలో రెవెన్యూ పాలనను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజలకు ఆధునిక, గౌరవప్రదమైన సేవలందించాలనే లక్ష్యంతో దశలవారీగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భవనాల నిర్మాణాలపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతలో అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న 107 తహసీల్దార్ కార్యాలయాలు, 10 ఆర్డీవో కార్యాలయాలకు రూ.263 కోట్లతో, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రూ.97 కోట్లతో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో డీఐజీ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం భవనాల కోసం రెండు విభాగాలకు సంబంధించి రూ.360 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ భవనాలన్నీ ఒకే నమూనాలో, ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రూపొందిస్తామని ఆయన చెప్పారు. వీటి నిర్మాణ బాధ్యతను హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. హౌసింగ్ అధికారులు జిల్లాస్ధాయిలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని కొత్త భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలందించే కార్యాలయాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మితమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లస్టర్లుగా విభజించి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా ప్రైవేటు సంస్ధలతో నిర్మిస్తున్నామని తెలిపారు. అయిదేళ్ల నిర్వహణ బాధ్యతను కూడా ఆ సంస్ధలే తీసుకున్నాయని, ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్ధాపన చేయగా నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





