మూడున్నర కోట్ల పని దినాలు పూర్తి చేయాలి

– ఉపాధి కోరే కూలీలతో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంచాలి
– కూలీల ఆరోగ్యం పట్ల అధికారులు జాగ్రత్తలు పాటించాలి
– ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో ములుగు నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మే నెల ఉపాధి హామీ పథకం అమలులో అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఉపాధి కోరిన ప్రతి కుటుంబానికీ పనిని కల్పించడం ప్రధాన లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధి పనులకు డిమాండ్ అధికంగా ఉన్నందున సాంకేతిక, ఇతర సమస్యలను అధిగమించి ప్రతి కూలీకి పని అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెలలో కనీసం మూడున్నర కోట్ల పని దినాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి ఆదేశించారు. ఏప్రిల్‌లో అధికారులు యజ్ఞంలా పనిచేసి కోటిన్నర పని దినాలను పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం పంట కోతలు ముగియడంతో ఉపాధి కూలి పనులకు డిమాండ్ మరింత పెరుగుతుందని, అర్హులైన అన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పని ప్రాంతాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ వంటి మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. కూలీల ఆరోగ్యాన్ని కాపాడుతూ పనులు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు నిర్వహించేలా ప్లాన్ చేయాలని సూచించారు. అలాగే తక్కువగా ఉపాధి పనులు జరుగుతున్న మండలాలు, గ్రామ పంచాయతీలను స్వయంగా పర్యవేక్షించాలని, పని దినాల లక్ష్య సాధనకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి హాబిటేషన్‌లో పనులు ప్రారంభించడం, ప్రతి ఉపాధి కోరుకునే వ్యక్తికి పని కల్పించడం, ప్రతి పని ప్రదేశంలో తగిన సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 ఉపాధి పనులను అందుబాటులో ఉంచడం, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించడం, ప్రత్యేక అధికారులను నియమించి పనుల పురోగతిని మెరుగుపరచడం వంటి చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌లతో కలిసి ఉపాధి కోరే కూలీలతో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంచాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *