“తెలంగాణ అనే పదం 14వ శతాబ్దం నాటి తెల్లాపూర్ శాసనంలో స్పష్టంగా ఉన్నది. అక్బర్ నామా గ్రంథంలోనూ ఫజల్ రచనల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనిపిలిచారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యాహ్నం ఉన్న ఈ భూభాగాన్ని త్రిలింగాణం అనగా,కాలక్రమంలో తెలంగాణగా మార్పు చెందింది. ఇలాంటి చారిత్రిక, సాహిత్య ఆధారాలు కోకొల్లలు. కాలగమనాన్ని ఏ మాత్రం పరిశీలించాలనే సోయి కూడా లేకుండా మాట్లాడడం అంటే ఆంధ్ర పెత్తందార్ల బూట్లు నాకి పదవి పొందాలనే తపన తప్ప వేరేమీ లేదు..”
అమ్మోనివా! నువ్వు అయ్యోనివా! తెలంగానోనికి తోటి పాలోనివా! అంటూ దశబ్దాల క్రితం గూడ అంజన్న రాసిన పాట ఇవ్వాళ పతాక శీర్షిక అయ్యింది.సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ ( పూర్వ ఆంధ్ర రాష్ట్రం) ఉప ముఖ్యమంత్రి తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబద్ లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణా నీ అయ్య జాగీరా? అని సినిమా ఫక్కీలో వదిలిన డైలాగ్ ఇందుకు ప్రధాన కారణం అయ్యింది.
తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని తెలంగాణకు చెందిన మాజీ టిడిపి నాయకుడు, ఆంధ్ర పాలకుల ప్రాపకం కోసం ప్రాకులాడుతూ మంగళగిరి లో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో అవాకులు చవాకులు పేలాడు. ఇది అతని అజ్ఞానానికి తార్కాణం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన రోజున ప్రెస్ మీట్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ నీ అయ్య జాగీరా? అని రెచ్చకొడతాడు. ఇది అతని అనాలోచిత ఆవేశానికి నిదర్శనం. సుదీర్ఘ పోరాట చరిత్ర గల తెలంగాణ పై ఎలాంటి అవగాహన లేకుండా స్క్రిప్ట్ లో ఉన్నట్టు సినిమా డైలాగులు చెప్పడం అజ్ఞానికి నిదర్శనం . చూడడానికి ఈ మాటలు సాధారణంగా, యాదృచ్చికంగా వెలువడినట్టు కనిపించినా, ఈ పదాల వెనక భయంకరమైన కుట్ర దాగి ఉంది. అదేమంటే వీలైతే తెలంగాణపై తిరిగి పెత్తనం చేయడానికి లేదంటే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ( దేశ రెండవ రాజధాని పేరుతో ) చేయాలనే దురాలోచనలో భాగమే.
తెలంగాణ అనే పదం 14వ శతాబ్దం నాటి తెల్లాపూర్ శాసనంలో స్పష్టంగా ఉన్నది. అక్బర్ నామా గ్రంథంలోనూ ఫజల్ రచనల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనిపిలిచారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యాహ్నం ఉన్న ఈ భూభాగాన్ని త్రిలింగాణం అనగా,కాలక్రమంలో తెలంగాణగా మార్పు చెందింది. ఇలాంటి చారిత్రిక, సాహిత్య ఆధారాలు కోకొల్లలు. కాలగమనాన్ని ఏ మాత్రం పరిశీలించాలనే సోయి కూడా లేకుండా మాట్లాడడం అంటే ఆంధ్ర పెత్తందార్ల బూట్లు నాకి పదవి పొందాలనే తపన తప్ప వేరేమీ లేదు. ఆవేశపరుడిగా పేరున్న పవన్ కళ్యాణ్ ను తెలంగాణ పైకి ఎగదోసి,తమప్రాభవం తిరిగి పొందాలనే ఆంధ్ర పెత్తందార్ల కుట్రలో భాగంగానే చూడాలి. పవన్ కళ్యాణ్ నీ అయ్య జాగీరా? అన్నమాట ఊటంకించడంలో అర్థం అదే . జమీందారు, జాగిర్దారు వ్యవస్థ రద్దు అయ్యి దశాబ్దాలు గడిచాయి అన్న విషయ పారశీలనా జ్ఞానం లేకపోయే. ప్రాంతీయతత్వం విషయానికి వస్తే దాన్ని ఆణువణువునా నింపుకొని ప్రవర్తిస్తున్నది ఆంధ్ర పెత్తందారులే. రెచ్చగొట్టే మాటలతో ప్రాంతీయ చిచ్చుపెట్టి తెలంగాణా ప్రజలలో ఆశాంతికి పాదులువేసి లబ్ది పొందాలనే పేరాశ. నిజమైన ఉగ్రవాదులు, తెలంగాణ ద్రోహులు ఆంధ్ర పెత్తందారులే అన్న విషయం సుస్పష్టం.
ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (పాత ఆంధ్ర రాష్ట్రం) ఏర్పడి పుష్కరకాలం గడిచినా అక్కడ సొంత ఇల్లు నిర్మించుకొని ఉండలేని దుస్థితి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలది. నిజంగా సిగ్గుచేటైన విషయం. ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కిన నాటి నుండి నేటి వరకు కొనసాగుతున్న దురాక్రమణలో భాగమే ఇది. పైగా దబాయింపు. రుబాబు గిరి. హైదరాబాద్ తోపాటు పలు అభివృద్ధి చెందిన ప్రాంతాలలో, నీటి వనరు కలిగిన ప్రాంతాలలో, ఉద్యోగ ఉపాధి దొరికే ప్రాంతాలలో, సింగరేణి ప్రాంతంలో భూములను, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పూర్తిగా కొల్లగొట్టారు. రాజకీయ పెత్తనం కూడా కొనసాగుతూనే ఉన్నది. సినీమా రంగం మొత్తం వారి చెప్పు చేతల్లోనే ఉన్నది. ఇదేమిటని ప్రశ్నిస్తే? తాటతీస్తామన్నంత పదాలు వాడడం ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టడమే. ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. వద్దు వద్దంటున్నా బాలసుబ్రమణ్యం, ఎన్టీఆర్ విగ్రహాలను హైదరాబాదులో పెట్టించి తమాషా చూస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. స్వీయ విమర్శ చేసుకోవడం ఆంధ్ర పెత్తందారులకు ఎంతైనా అవసరం. మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడినప్పుడు కూడా ఇలాంటి కారుకూతలు కూయడం వల్లనే తన్నితరిమేశారన్న విషయం మరచిపోయారేమో?
భాషా ప్రయుక్త రాష్ట్రాల ముసుగులో తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ (తెలంగాణ) ను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. పెద్దమనుషుల ఒప్పందంలో ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి ఇస్తే, ఉపముఖ్యమంత్రి వేరొక ప్రాంతానికి ఇవ్వాలని రాసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నీలం సంజీవరెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంటే ఆరో వేలు వంటిదని అపహస్యం చేయడంతోనే తెలంగాణాపై చిన్న చూపు ప్రారంభమైంది. పరిపాలనలో ఇంగ్లీషు అవసరమంటూ అన్ని శాఖలలో ప్రధాన అధికారులుగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వారు కైవసం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ బంధువులను, స్నేహితులను తీసుకొచ్చి ఉద్యోగాల్లో నింపి వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కారుచౌకగా తెలంగాణలో భూములను కొనేశారు. నదీ జలాలను దారి మళ్లించారు. సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేశారు. ఆచార వ్యవహారాలను అంటరాని వాటిగా చూసారు. వనరుల దోపిడీ తారస్థాయికి చేరింది. భాషయాసల అవహేళన మిన్నంటింది. ఈ ప్రాంత ప్రజలు ద్వితీయశ్రేణి పౌరులుగా బ్రతకాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో రగిలిపోయిన కోట్లాది తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం నినాదంతో స్వరాష్ట్రంకై ఉద్యమించారు. పోలీసు కాల్పుల్లో బలయ్యారు. నిర్బంధాలకు గురయ్యారు. నిరాశా నిస్పృహలతో వందలాది బలిదానాలకు బాటపడింది. ఉద్యమం నిరసన దీక్ష నుండి మిలియన్ మార్చ్ తో సహా, సహాయ నిరాకరణ, బంద్ లతో అట్టుడికింది. ఆటపాటలు, ధూమ్ ధామ్ లతో ఊర్రూతలూగించే ఉపన్యాసాలతో, చైతన్య యాత్రలతో దిల్లీ పీఠం కదిలింది. రాజకీయపక్షాలన్నీ ఒక తాటి పైకి వచ్చాయి. ప్రజాగ్రహానికి తలొగ్గిన కేంద్ర హోంశాఖ మంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. ఆంధ్ర పెత్తందారుల కుట్రలతో ప్రకటన వెనక్కి తీసుకోబడింది. తెలంగాణ మరోసారి అగ్నిగుండం కావడంతో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించడం అనివార్య ఏమైంది. ఇది వాస్తవంగా జరిగిన చరిత్ర.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదు గాని, ఏర్పాటు క్రమం బాధించిందని అర్ధం పార్ధంలేని సినిమా డైలాగులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఏమి జరిగిందో? ఎలా జరిగిందో? తెలియని అజ్ఞానం. వేళ్ళ మీద లెక్కపెట్టగల, ఎనిమిది మంది మనుషులు దిల్లీలో కూర్చొని పెద్దమనుషుల ఒప్పందం పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చేశారన్న చారిత్రిక జ్ఞానం లేకపోయే. కేవలం స్క్రిప్ట్ డైలాగులు చదవడం వల్ల ఏర్పడిన అజ్ఞానమే అందుకు కారణం. మరో అజ్ఞాని ఆంధ్ర పెత్తందార్ల బూట్లు నాకెందుకు ఆరాటపడి తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటాడు. బుద్ధి ఉన్నవాడెవడు ఇలాంటి పిచ్చికూతలు కూయడు. ఇది వింటూ వేదికపై ఎంజాయ్ చేసిన ప్రబుద్ధుడు అలా అనడం సరికాదని మూడు రోజుల తర్వాత సన్నాయి నొక్కులు నొక్కుతాడు. ద్వంద నీతికి ఇదో మచ్చుతునక మాత్రమే. గద్దర్ పై కాల్పులు జరిపి, మారోజు వీరన్న ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసి, నయీమ్ తో ప్రైవేట్ హంతక ముఠాను ఏర్పాటు చేసి బెల్లి లలితను 17 ముక్కలుగా నరికి చంపించిన పాలకుడి నోట చిలుక పలుకులు.
ఎన్టీఆర్ ను, బాలసుబ్రమణ్యం లను కీర్తిస్తున్న ఆంధ్ర పెత్తందార్ల ఏజెంట్ కు తెలంగాణాపై దుమ్మెత్తి పోస్తుంటే చెవులు వినపడవు. కళ్ళు కనపడవు. నోరు లెగవదు. దశాబ్దాలుగా బానిసత్వానికి అలవాటు పడ్డ బ్రతుకు కదా మరి. తెలంగాణ మెజారిటీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు మౌనవ్రతం పాటిస్తున్నారు, మూగనోము నోస్తున్నారు. దశాబ్దాలుగా అనుచరగణంగా అలవాటుపడి ఉండడం వల్ల తెలంగాణ సోయి లేకుండా పోయిందేమో? అన్న అనుమానాలకు తావిస్తున్నది. తెలంగాణాపై గన్ను పెట్టినవాడు, పదవీకాంక్షతో తెలంగాణలో వనరుల దోపిడీకి సహకరించడంలో అలవాటుపడ్డ బ్రతుకులు కదా! బాధ్యత గల బుద్ధి జీవులు ఇలాగే మిన్నకుండా ఉంటే చవటలదే రాజ్యం అవుతుంది.
హైదరాబాదులో వివిధ భాషలు, సంస్కృతి, ప్రాంతాల వారు వచ్చి స్థిరపడ్డారు. బ్రతుకుతున్నారు. వారెప్పుడు ఇలాంటి రాజకీయ పెత్తనం చేయలేదు. అవమానాలకు గురి చేయలేదు. చిన్న చూపు చూడలేదు. వారి వ్యాపారాలు వారు చేసుకుంటూ ప్రజలతో కలిసిపోయే ప్రయత్నం చేశారు. ఆంధ్ర పెత్తందార్లను చూసి మార్వాడీలు మోపౌతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు అసహనంతో ఉన్నారు. భౌగోళికంగా రాష్ట్రం ఏర్పడ్డా తమ ఆకాంక్షలు నెరవేరలేదనే ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వ భూములకు సంరక్షకులుగా ఉండాల్సిన పాలకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లాగా మారి భూములను వేలంవేసి మరీ అమ్మేస్తున్నారు. అదేమంటే పారిశ్రామికీకరణ అని ప్రచారం. ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా? ఎంత శాతం? అన్న ప్రశ్నలకు జవాబులేదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములలో కొత్త సిటీలోనే ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు రింగ్ పెంచి పావు భాగం తెలంగాణాను హైదరాబాదుకు విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే కుట్రలకు తెర లేపుతున్నారు. తెలంగాణాను తెగనమ్మే కుట్రలు జోరందుకున్నాయి. ప్రతిపక్షాలు కూడా కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితమై ఖండనలు చేస్తున్నాయి. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా పాలకుల కనుసన్నల్లో దేదీప్యమానంగా విస్తరిస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలన్నీ ఏటిలో పిసికిన చింతపండు ఫలితం అయ్యాయి. ఓపెన్ కాస్ట్ మైనింగ్ తో సింగరేణి బొందలగడ్డ అయింది. అటవీ భూములు అన్యాక్రాంత మవుతున్నాయి. భారీ ప్రాజెక్టుల నిర్మాణం వలన నిర్వాసితులైన ఆదివాసుల, దళితుల, బడుగు బలహీన వర్గాల ప్రజల బాధలు పట్టించుకునే నాదుడే లేడు. విద్యా రంగం కార్పోరేటీకరణ విచ్చలవిడిగా సాగుతుంది. మహిళలపై దాడులు పెరిగి భద్రత మృగ్యమయ్యాయి. ఉచిత విద్య – ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ఒక పీడకలగానే మిగిలే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తాం! ప్రాంతీయతరుడు దోపిడీ చేస్తే పొలిమేరల దాకా తన్ని తరుముతాం! అన్న మహా కవి కాళోజి మాటలను అనుసరించడమే ప్రస్తుత కర్తవ్యం. మమ్మల్ని దోచుకోవడానికి మీరెవరు? అని ప్రశ్నించగలగాలి. తెలంగాణ అంటే చైతన్యం. తెలంగాణ అంటే దోపిడీపై తిరుగుబాటు. అని మరోసారి రుజువు చేద్దాం.తెలంగాణా అంటే ఆత్మ గౌరవవ నినాదం. అందుకే *ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా…* అని నిరసించిన భక్త రామదాసు వారసత్వాన్నయిన గుర్తుకు తెచ్చుకోండి. ప్రజలారా! తస్మాత్ జాగ్రత్త!

రమణాచారి





