ఇస్రోలో శాస్త్రవేత్తల మూకుమ్మడి రాజీనామాలు

– అప్రమత్త‌మైన‌ అంతరిక్ష విభాగం
– రాజీనామా నిబంధనలు కఠనతరం చేస్తూ ఆదేశాలు

న్యూదిల్లీ,జూలై16:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు భారీ ఎత్తున రాజీనామాలు చేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు అంతరిక్ష విభాగం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌స్పేస్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. శాస్త్రవేత్తలకు రాజీనామాల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ ఆదేశాలను అంతరిక్ష విభాగం గురువారం జారీ చేసింది. వాటిని యూఆర్‌ ‌రావు శాటిలైట్‌ ‌సెంటర్‌, ‌విక్రమ్‌ ‌సారాభాయ్‌ ‌స్పేస్‌ ‌సెంటర్‌ ‌లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు కేంద్రాలకు కూడా పంపింది. భారత్‌ ‌చేపట్టిన ప్రతిష్ఠాత్మక మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్‌తోపాటు ఇతర ‘ముఖ్యమైన మిషన్లు’కు అనుబంధంగా పని చేస్తున్న గ్రూప్‌- ఏ ‌శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది నుంచి వచ్చే రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలు యథావిధిగా అంగీకరించ వద్దని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఉద్యోగుల రాజీనామాతో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. శాస్త్రవేత్త, ఇంజనీర్‌ ‌హోదా లేదా అంతకంటే తక్కువ స్థాయిలోని సాంకేతిక సిబ్బంది నుంచి స్వీకరించిన రాజీనామాలను తమకు పంపాలని సదరు కేంద్రాలకు అంతరిక్ష విభాగం స్పష్టం చేసింది. అదికూడా ఆయా కేంద్రాల్లోని డైరెక్టర్ల స్పష్టమైన సిఫార్సులతో పంపాలని కోరింది. అయితే గ్రూప్‌- ఏ ‌స్థాయిలోని ఉద్యోగుల రాజీనామాలను ఆమోదించేందుకు ఈ కేంద్రాల డైరెక్టర్లకు గతంలో ఇచ్చిన ఆదేశాలను తాజాగా అంతరిక్ష విభాగం రద్దు చేసింది. ఇటీవల ఇస్రో నుంచి 100 మందికి పైగా సిబ్బంది రాజీనామా చేశారంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి. అందులో బెంగళూరులోని యూఆర్‌ఎస్‌సి, తిరువనంతపురంలోని వీఎస్‌ఎస్‌సి నుంచి పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు రాజీనామాలు చేశారు. ఆ జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ రాజీనామాలు చేసిన శాస్త్రవేత్తలు అంతా.. స్పేస్‌ ‌స్టార్టప్‌లలో చేరుతున్నట్లు సమాచారం. 2020లో అంతరిక్ష రంగంలోకి ప్రవేశించేందుకు ప్రైవేట్‌ ‌సంస్థలను కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023లో భారత అంతరిక్ష విధానాన్ని ప్రారంభించింది. నాటి నుంచి స్పేస్‌ ‌స్టార్టప్‌లు దూసుకు వెళ్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 400కు పైగా అంతరిక్ష స్టార్టప్‌లు ఉన్నాయి. అవి 500 మిలియన్‌ ‌డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 2025లో వాటికి 150 మిలియన్‌ ‌డాలర్లు సమకూరాయి. పిక్సెల్‌, ‌ధ్రువ స్పేస్‌, ‌స్కైరూట్‌ ఏరోస్పేస్‌, అగ్నికుల్‌ ‌కాస్మోస్‌, ‌బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్‌ ‌వంటి కంపెనీలు ఈ పోటీలో ముందున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *