– బోర్డు పరీక్షలకు పునాది వేసే సమయంలో ఒత్తిడి తగదని వ్యాఖ్య
న్యూదిల్లీ, జూలై 16: మూడో భాషను 9వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు పునాది వేసే ఈ దశలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని వ్యాఖ్యానించింది. 9వ తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సీబీఎస్‌ఈ అమలు చేస్తున్న మూడు భాషల విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొత్త భాషను నేర్చుకోవడం మంచిదేనని, అయితే బోర్డు పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో విద్యార్థులపై అదనపు భారం వేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. కొత్త భాషను చిన్న తరగతుల నుంచే బోధిస్తే విద్యార్థులకు అలవాటు కావడానికి సమయం దొరుకుతుందని పేర్కొంది. ఇటీవల సీబీఎస్‌ఈ 9వ తరగతి నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, పాఠశాలలు, విద్యార్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అమలుకు తగిన సమయం ఇవ్వలేదని, తగిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవని, ఇతర సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో లేవని విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ విధానాన్ని పూర్తిగా నిలిపివేయలేదు. అయితే దీనిపై కేంద్రం మరోసారి ఆలోచించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణలో కేంద్రం, సీబీఎస్‌ఈ తమ వైఖరిని వివరించనున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





