మణుగూరు-రామగుండం రైల్వే లైను ఆమోదం!

– రూ.5.818.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మాణం
– మారుమూల గిరిజన పల్లెలకు పట్టనున్న మహర్దశ
– రైల్వే ప్రాజెక్టులపై అశ్వినీ వైష్ణవ్ తో కిషన్ రెడ్డి చర్చ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 21: తెలంగాణలో రవాణా రంగాన్ని సరికొత్త దిశ‌కు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న కీలకమైన మణుగూరు-రామగుండం రైల్వే లైన్ ప్రాజెక్టుకు నరేంద్ర మోదీ సర్కార్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ. 5,818.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ కొత్త లైన్ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం దక్కడంతో పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు పెద్ద ఉపశమనం లభించనుంది. మొత్తం 207.8 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ సరికొత్త రైల్వే లైన్ మంథని, భూపాలపల్లి, తాడ్వాయి, గోపాలరావుపేటలతో పాటు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర జరిగే మేడారం మీదుగా వెళ్లనుంది. ప్రస్తుతం మణుగూరు నుండి రామగుండం వెళ్లాలంటే భద్రాచలం రోడ్ (కొత్తగూడెం), కాజీపేట మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కానీ, ఈ కొత్త లైన్ పూర్తయితే మణుగూరు – రామగుండం మధ్య ఏకంగా 90 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం, డబ్బు భారీగా ఆదా అవుతాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరతోపాటు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులకు కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వెనుకబడిన మారుమూల గిరిజన ప్రాంతాలకు ఒక పెద్ద వరంగా మారబోతోంది. దశాబ్దాలుగా రైలు ముఖం చూడని ఎన్నో గ్రామాలకు ఈ లైన్ ద్వారా రైల్వే కనెక్టివిటీ లభిస్తుంది. కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలో లభించే బొగ్గు, ఖనిజాలు, ఎరువులు, ఇతర పారిశ్రామిక సరుకు రవాణాకు ఈ రైల్వే లైన్ అత్యంత కీలకంగా మారనుంది. దీనివల్ల సింగరేణి బొగ్గు గనుల రవాణా మరింత వేగవంతం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు రైల్వే శాఖ సరికొత్త ప్లాన్ సిద్ధం చేసింది. డీపీఆర్ తయారీ, భూసేకరణ, వివిధ ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు తీసుకునే బాధ్యతలను రైల్వే శాఖ చూసుకుంటుంది. అయితే, ప్రాజెక్ట్ నిర్మాణం, నిధుల సమీకరణ పనులను ప్రైవేట్ భాగస్వామ్య సంస్థకు అప్పగిస్తారు. దీనికోసం రైల్వే శాఖ త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది. ఈ ప్రాజెక్ట్ టైమ్ఎన్ ప్రకారం.. మొదటి ఏడాదిలో పూర్తిగా భూసేకరణ పక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత నాలుగు సంవత్సరాల్లో అంటే మొత్తం ఐదేళ్ల వ్యవధిలో ఈ కొత్త రైల్వే లైన్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలావుంటే కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.

రాష్ట్రంలో రైల్వేప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు. ఈ సమావేశంలో 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి వివరంగా చర్చించారు. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణికులకు కీలకమైన రవాణా సౌకర్యంగా ఉన్న విషయంపై మాట్లాడారు. టైమింగ్స్ రెగ్యులరైజేషన్, సౌకర్యాలను మరింత మెరుగు పరిచేలా చొరవ తీసుకోవాలని తాను కోరానని.. దీనికి కేంద్ర రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తదనుగుణంగా ఎంఎంటిఎస్ మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొత్త రైల్వేలైన్లు, హైస్పీడ్ రైల్ కారిడార్ పనుల పురోగతి తదితర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తోందని వెల్లడించారు. రానున్న రోజుల్లోనూ రైల్వేనెట్వర్క్ పెంచడం, ప్రజలకు సౌకర్యాల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *