మండలస్థాయి ధరల నిర్ణయ కమిటీలు వేయాలి

ఇసుక విక్రయ కేంద్రాలు పెంచాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్‌, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు సమావేశమై ధరలు నిర్ణయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్‌ మొబిలైజేషన్‌ సమావేశం సోమవారం జరగగా మంత్రులు, సబ్‌ కమిటీ సభ్యులైన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిపై శాఖల వారీగా సమీక్షించారు. గత సమావేశం నిర్ణయం మేరకు రాష్ట్రంలో 20 కేంద్రాల్లో ఇసుక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్‌ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో త్వరితగతిన పెద్ద సంఖ్యలో సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని సబ్‌ కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భూముల బేసిక్‌ విలువను పెంచితే దరఖాస్తుదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజనులే ఇసుక క్వారీలు నిర్వహించేందుకు చేపట్టిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం, సబ్‌ కమిటీ చైర్మన్‌ అధికారులను ఆదేశించారు. ఈ సబ్‌ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సమీక్షించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమర్షియల్‌ టాక్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రిజ్వీ, మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీధర్‌, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌, కమిషనర్లు శశాంక, హరిత, హరి కిరణ్‌, గౌతం, సురేంద్రమోహన్‌ హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page