సాహిత్యానికి ఉత్సవాల రూపంలో ఒక వేదిక ఏర్పడటం నిజంగా ఆహ్వానించదగిన పరిణామం. ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి ఇటువంటి ఉత్సవాలు ఒక కొత్త శ్వాసను అందించగలవని భావిస్తాను. సాహిత్యం ఒక వర్గానికో, ఒక తరానికో పరిమితం కాకుండా కొత్త తరాల పాఠకులకు చేరాలి. కొత్తగా రాస్తున్నవారికి తమ గొంతును వినిపించే అవకాశం రావాలి. ప్రధాన స్రవంతిలో తగినంతగా వినిపించని ప్రాంతీయ, అస్తిత్వ, స్త్రీవాద, దళిత, ఆదివాసీ, యువ సాహిత్యస్వరాలకు కూడా సమానమైన ప్రాధాన్యం లభించాలి. సాహిత్య ఉత్సవాలు కేవలం రచయితల కలయికలోనో, పుస్తకాల ఆవిష్కరణలోనో ముగిసిపోకుండా, కొత్త ఆలోచనలకు, భిన్నమైన గొంతుకలకు, ఆరోగ్యకరమైన చర్చలకు వేదిక కావాలి. ఒక ఉత్సవం ముగిసిన తర్వాత కూడా ఒక పుస్తకం చదవాలనే ఆసక్తి ఒకరిలోనైనా మొదలైతే, అదే ఆ ఉత్సవం సాధించిన అసలైన విజయం.
ఛాయా సాహిత్యోత్సవం భిన్నమైన ఆలోచనలకు, కొత్త రచయితల స్వరాలకు, సాహిత్యంపై నిజాయితీతో కూడిన సంభాషణలకు చోటు కల్పిస్తుందని ఆశిస్తున్నాను. సాహిత్యం అనేది సమాధానాలు చెప్పే ప్రక్రియ మాత్రమే కాదు; మనలో ఎన్నోప్రశ్నలను మేల్కొలిపే ప్రక్రియ కూడా. ఒక రచయిత తన కాలంతో, సమాజంతో, తనలోని సంఘర్షణలతో చేసే సంభాషణ పాఠకులకి చేరాలి. ఇందులో నా ప్రాతినిధ్యం ఒక రచయిత్రిగానే కాకుండా, సాహిత్యాన్ని ప్రేమించే పాఠకురాలిగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రచయితగా మనం సాధించాల్సింది మన ఉనికిని చాటుకోవడం మాత్రమే కాదు, రచన ద్వారా మరొకరి ఉనికిని గుర్తించడం కూడా. బహుశా సాహిత్యానికి ఉన్న గొప్పశక్తి అదే!
-మాధురి పాలాజి





