చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలి

– చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల
– ‘థ్రెడ్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్ ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడి నేతన్నల నైపుణ్యం తెలంగాణకు గర్వకారణమని చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన హైటెక్స్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ ఇక్కడి కళాకారుల సృజనాత్మకతకు, నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని తెలిపారు. భూదాన్ ఉద్యమానికి చారిత్రక కేంద్రంగా నిలిచిన పోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉందని, పోచంపల్లి రుమాళ్లు, ఇక్కత్ చీరలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండున్నరేళ్లల్లో చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం రూ.1,400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. నేతన్నల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. గ్లోబలైజేషన్ పోటీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా చేనేత కుటుంబాల పిల్లలకు ఆధునిక డిజైన్లు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. డూప్లికేట్ ఉత్పత్తుల వల్ల చేనేత బ్రాండ్‌కు కలిగే నష్టాన్ని నివారించడంలో కూడా ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే మూడు రోజులపాటు కొనసాగే ఈ ప్రదర్శనకు మరింతమంది ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకుని చేనేత కళాకారులకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు, అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *